హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన నియోజకవర్గ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే..! ఆయన పలు ప్రాంతాలను సందర్శిస్తూ ఉన్నారు. హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిని ఆయన తనిఖీ చేశారు. ఆసుపత్రి సిబ్బంది పనితీరుపై బాలకృష్ణ అసహనం వ్యక్తం చేశారు. రెండవ రోజు పర్యటనలో భాగంగా ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్యంతో పాటు వైద్య సౌకర్యాలపై ఆరా తీశారు. నేరుగా పేషెంట్ల వద్దకు వెళ్లి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. అయితే వైద్యుల నిర్లక్ష్యంతో రెండు రోజుల పసికందు చనిపోయిందంటూ బాలకృష్ణ ముందు శ్రావణ్ అనే వ్యక్తి కన్నీటిపర్యంతమైయ్యాడు. దీంతో ఆగ్రహించిన బాలకృష్ణ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ని పిలిచి ఆరా తీశారు.
మొదటి రోజు పర్యటనలో భాగంగా హిందూపురంలో సీమ టీడీపీ నేతల సదస్సులో పాల్గొన్న బాలకృష్ణ రాయలసీమకు మిగులు జలాలు కాదు.. నికర జలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. గతంలో చేపట్టిన నదుల అనుసంధానం జరగాలని ఆయన కోరారు. మన హక్కులను కేంద్రం చేతుల్లోకి వెళ్లేలా చేస్తున్నారు. అవసరమైతే సీమ నీటి ప్రయోజనాల కోసం ఢిల్లీలో హర్యానా తరహాలో ఉద్యమాన్ని తీసుకొని రావాలని పిలుపును ఇచ్చారు. రాయలసీమ ఒక్కప్పుడు రతనాల సీమ.. కానీ నిర్లక్ష్యం కి గురై ఈ పరిస్థితి వచ్చిందని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. ఇక్కడి పరిస్థితి చూసి హంద్రీనీవాకు ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారని.. ఇక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి జోలె పట్టారని అన్నారు నందమూరి బాలకృష్ణ.