ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంపై రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం పథకం ' స్త్రీ శక్తి'ని అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు..అని మంత్రి పేర్కొన్నారు. కాగా రాష్ట్రంలో ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు అని చెప్పారు. పల్లెవెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, మెట్రో ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ ఇలా మొత్తం 6,700 బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నట్లు చెప్పారు
రాష్ట్రంలో ఆర్టీసీకి మొత్తం 11500 బస్సులు ఉండగా..8459 బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు అవుతుందని మంత్రి చెప్పారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ చూపించి ఉచిత బస్సు ప్రయాణం చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా మహిళలకు జీరో ఫేర్ టికెట్ జారీ చేస్తాం..అని మంత్రి ప్రకటించారు. ఈ ఉచిత బస్సు ప్రయాణం పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి 1950 కోట్లు నిధులు చెల్లిస్తుందని చెప్పారు. ఇక రాష్ట్రంలో కొత్తగా 700 ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేశాం, వచ్చే రెండేళ్లలో మరో 1400 బస్సులు కొనుగోలు చేయబోతున్నాం..అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.