రాష్ట్రంలోని బీసీ స్టడీ సర్కిళ్లలో వెనకబడిన తరగతుల విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉచిత డీఎస్సీ కోచింగ్ అందించే దస్త్రంపై తొలి సంతకంతో రాష్ట్ర వెనకబడిన తరగతుల సంక్షేమం, ఈడబ్ల్యుఎస్ మరియు చేనేత జౌళి శాఖల మంత్రిగా సంజీవిరెడ్డిగారి సవిత బాధ్యతలు చేపట్టారు. ఈమేరకు గురువారం రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనంలో ఆమె మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం బిసి స్టడీ సర్కిళ్ళలో ఉచిత డీఎస్సీ కోచింగ్, ఎన్టీఆర్ విదేశీ విద్య పథకం కొనసాగింపు పధకాలపై మొదటి, ద్వితీయ సంతకాలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నిరుద్యోగుల కోసం మెగా డీఎస్సీ ఫైల్ పై తొలి సంతకం చేశారని.. ఆయన అడుగుజాడల్లో వెనకబడిన తరగతుల్లోని నిరుద్యోగులకు ఉచిత డీఎస్సీ కోచింగ్ ఫైల్ పై తొలి సంతకం చేశానన్నారు.
అదే విధంగా 2014-19లో 2,173 మందికి విదేశాల్లో చదువుకునే అవకాశం కల్పించిన ఎన్టీఆర్ విదేశీ విద్య పథకాన్ని కొనసాగించనున్నామని మంత్రి సవిత పేర్కొన్నారు. వెనకబడిన తరగతుల సంక్షేమం కోసం త్వరలోనే బీసీ కమిషన్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. 2014-19 లో ఉమ్మడి 13 జిల్లాలకు మంజూరు చేసిన బీసీ భవన్ ల నిర్మాణాలను సైతం పూర్తి చేస్తామన్నారు. ఈ ప్రభుత్వంలో చేనేత కళాకారులు, హస్త కళాకారులకు తగిన సబ్సిడీలు, ప్రోత్సాహకాలు అందిస్తామని హామీ ఇచ్చారు. వారానికి ఒక్కసారైనా సచివాలయ ఉద్యోగులు, రాష్ట్ర ప్రజలు చేనేత వస్త్రాలు ధరించాలని విజ్ఞప్తి చేశారు.
బీసీ కులానికి చెందిన మహిళకు వెనకబడిన తరగతుల మంత్రిగా అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. విభజన నాటికి రాష్ట్రంలో ఉన్న32 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలను 106 కి పెంచిన ఘనత చంద్రబాబుదే అన్నారు. రాష్ట్రం బాగుండాలనే తపన కలిగిన వ్యక్తి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. దేశానికి బీసీ నాయకుడు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో తనకు బీసీ సంక్షేమ శాఖకు మంత్రిగా పని చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.