చేనేత కార్మికులకు గుడ్‌న్యూస్.. 90 శాతం సబ్సిడీతో పనిముట్లు
త్వరలోనే నూతన టెక్స్ టైల్ప్ పాలసీ తీసుకురానున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళిశాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు.
By Medi Samrat Published on 21 Nov 2024 10:45 AM GMTత్వరలోనే నూతన టెక్స్ టైల్ప్ పాలసీ తీసుకురానున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళిశాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. గురువారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మిగనూరులో టెక్సటైల్స్ పార్కుపై టీడీపీ ఎమ్మెల్యే బి.జయనాగేశ్వరరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సవిత సమాధానం చెప్పారు. 2015 ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చేనేతలకు ఆసరాగా ఉండేలా ఎమ్మిగనూరులో టెక్స్ టైల్స్ పార్కు ఏర్పాటుకు నిర్ణయించారు. ఇందుకు 90 ఎకరాలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేశారన్నారు. తరవాత జగన్ ప్రభుత్వ హయాంలో అన్ని రంగాల మాదిరిగా చేనేత రంగం కూడా పూర్తిగా నిర్వీర్యమైందన్నారు. పేదల ఇళ్ల పేరుతో ఎమ్మిగనూరు టెక్స్ టైల్స్ పార్కులో 14 ఎకరాలను వైసీపీ ప్రభుత్వం కేటాయించిందన్నారు. ఈ నిర్ణయంపై తాము కోర్టుకు వెళ్లి స్టే తీసుకొచ్చి... టెక్స్ టైల్స్ పార్కు భూములను కాపాడామన్నారు. 2014-19లో నాటి చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఎమ్మిగనూరులో కచ్చితంగా టెక్స్ టైల్స్ పార్కు ఏర్పాటు చేయబోతున్నామని, ఈ పార్కు ద్వారా 5 వేల మందికి ఉపాధి కల్పించబోతున్నామని మంత్రి స్పష్టంచేశారు.
చీరాలలో హ్యాండ్లూమ్, టెక్స్ టైల్స్ పార్కులు
ఎమ్మిగనూరుతో పాటు రాయదుర్గం, మైలవరం, పామిడిలోనూ టెక్స్ టైల్స్ పార్కులు ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి సవిత తెలిపారు. చీరాలలో హ్యాండ్లూమ్ పార్క్ తో పాటు టెక్స్ టైల్స్ పార్కు కూడా నిర్మించనున్నట్లు తెలిపారు. త్వరలోనే టెక్స్ టైల్స్ పాలసీ తీసుకురాబోతున్నట్లు తెలిపారు. చేనేతలను అన్ని విధాలుగా ఆదుకోవాలన్న లక్ష్యంతో...దూరదృష్టితో 2014-19లో రాష్ట్ర వ్యాప్తంగా టెక్స్ టైల్స్ పార్కులు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారన్నారు. తరవాత వచ్చిన జగన్ వాటిని అభివృద్ధి చేయకపోగా, వ్యవస్థలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ప్రభుత్వ భూములు కబ్జా చేయడం, దోచుకోవడం, దాచుకోవడం తప్ప మరే అభివృద్ధి పనులు చేపట్టలేదన్నారు.
90 శాతం సబ్సిడీతో నేతన్నలకు పనిముట్లు
మంగళగిరిలో మంత్రి నారా లోకేశ్ వీవర్ శాల ఏర్పాటు చేసి.. చేనేతలకు అండగా నిలిచారని మంత్రి సవిత తెలిపారు. అదే స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా వీవర్ శాలలు ఏర్పాటు చేసే ఆలోచన తమ ప్రభుత్వానికి ఉందన్నారు. ఇప్పటికే కొందరు ఎంపీలు తమ ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి వీవర్ శాలల ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చారన్నారు. ఆదిత్య బిర్లా గ్రూప్ వంటి సంస్థల సాయంతో రాష్ట్రంలో పలుచోట వీవర్ శాలలు, కస్టర్లు ఏర్పాటు చేయబోతున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ నుంచి నేతన్నల సంక్షేమానికి కేంద్రం నుంచి కూడా నిధులు తీసుకురాబోతున్నామన్నారు. చేనేత కార్మికులకు 90 శాతం సబ్సిడీతో పనిముట్లు అందజేయబోతున్నామన్నారు. ధర్మవరంలో మెగా టెక్స్ టైల్స్ పార్కు ఏర్పాటుకు రూ.30 కోట్ల నిధులను కేంద్రం నుంచి రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మంజూరుకు కృషి చేశారన్నారు. చేనేత రంగానికి, నేతన్నకు తమ ఎన్డీయే ప్రభుత్వం పూర్వ వైభవం తీసుకురానుందని మంత్రి సవిత వెల్లడించారు.