ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా తిరుపతిలోని చారిత్రక తాతయ్య గుంట గంగమ్మ ఆలయాన్ని శనివారం సందర్శించారు. జాతర సందర్భంగా మంత్రి రోజా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాల్లో భాగంగా మంత్రి ఆర్కే రోజా సారె సమర్పించారు. గంగమ్మ ఆలయానికి భారీ ఎత్తున ఊరేగింపుగా వచ్చిన మంత్రి రోజా.. సారెతో పాటు పట్టు వస్త్రాలు సమర్పించారు. శోభాయాత్రలో పాల్గొన్న రోజా భారీ జనసందోహం మధ్య ఆలయానికి చేరుకున్నారు.
అనంతరం రోజా మీడియాతో మాట్లాడుతూ.. 800 ఏళ్ల నాటి ప్రముఖ ఆలయాన్ని సందర్శించడం, జాతరలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతమని అన్నారు. గతంలో తిరుమల ఆలయంలో భక్తులు ముందుగా ఆలయానికి వెళ్లి అమ్మవారి ఆశీస్సులు తీసుకునేవారని ఆమె తెలిపారు. రాష్ట్రంలో ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించాను' అని పేర్కొన్నారు. ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి రోజా తన వంతు కృషి చేసి గంగమ్మ జాతరకు నిధులు మంజూరు చేశారని అన్నారు.