సీట్ల మార్పులు చేర్పుల విషయంలో మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఓ వైపు టీడీపీ-జనసేన మధ్య సంబంధాల గురించి చర్చ జరుగుతూ ఉండగా.
By Medi Samrat Published on 18 Dec 2023 3:45 PM GMTఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఓ వైపు టీడీపీ-జనసేన మధ్య సంబంధాల గురించి చర్చ జరుగుతూ ఉండగా.. మరో వైపు వైసీపీలో ఆ నేతలు సీట్లు ఇస్తారా.. ఈ నేతలు సీట్లు దక్కుతాయా అని చర్చించుకుంటూ ఉన్నారు. కొందరు నేతలకు అసలు సీట్లు ఇవ్వకపోవచ్చని.. సీఎం జగన్ ఆ నిర్ణయం తీసుకున్నారని కొన్ని మీడియా సంస్థలు చెబుతున్నాయి. ఈ ప్రచారంపై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎల్లో మీడియా ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని తట్టుకోలేక విషపు రాతలు రాస్తోందని రోజా మండిపడ్డారు. ప్రజలకు మంచి చేసినప్పుడు ఎన్నికల్లో గెలుపు తప్పకుండా వస్తుందని.. ప్రజల మన్ననలు పొందితే సీట్లు అవే వస్తాయని తెలిపారు. వైసీపీలో సీట్ల కేటాయింపుపై ఎల్లో మీడియా అత్యుత్సాహం చూపిస్తోందని విమర్శించారు. వివిధ నియోజకవర్గాల్లో సీట్ల మార్పులు చేర్పుల విషయంలో ఒకటికి రెండుసార్లు మాట్లాడిన తర్వాతనే సీఎం జగన్ సర్దుబాటు చేస్తున్నారని.. అయినా ఎల్లో మీడియా మాత్రం కడుపు మంటతో విషపు రాతలు రాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇంకా సీట్ల సర్దుబాటు చర్చల్లోనే ఉన్నారని ఏపీ మంత్రి రోజా అన్నారు. ఉమ్మడి మేనిఫెస్టో తయారీకే వాళ్లకు సమయం లేదన్నారు. ఎక్కడ నుంచి పోటీ చేయాలో తెలియక వారు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. అలాంటి వాళ్లు వైసీపీ సీట్లకు సంబంధించి తమ మీడియాలో కథనాలు రాయిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ మధ్య చర్చలు జబర్దస్త్‌ను మించిన కామెడీలా ఉందన్నారు. సీఎం వైఎస్ జగన్ తండ్రిని మించిన తనయుడిలా ప్రజల కోసం పనిచేస్తున్నారని రోజాప్రశంసించారు.