వాలంటీర్లపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీలో తీవ్ర దుమారం రేపుతుంది. పవన్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి రోజా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆమె మంగళవారం మాట్లాడుతూ.. మహిళలను వాలంటీర్లు అక్రమరవాణా చేస్తున్నారని ఆరోపించడం దారుణమని అన్నారు. వాలంటీర్ల గురించి తెలియని పవన్ కల్యాణ్ రాజకీయ స్వార్థం కోసం ఇష్టారీతిన వాగుతున్నాడని ఫైర్ అయ్యారు. కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవని వ్యక్తి.. వాలంటీర్ల వ్యవస్థల గురించి తెలుసుకోకుండా అనాలోచిత ఆరోపణలు చేయడం మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. వెంటనే వాలంటీర్లను క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో 15వేల పైచిలుకు గ్రామ పంచాయతీలుంటే.. రెండు లక్షల 60వేల మంది వాలంటీర్లు పనిచేస్తున్నారని మంత్రి రోజా అన్నారు. వీరిలో సగం మంది మహిళా వాలంటీర్లు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. కొవిడ్ సమయంలో వాలంటీర్లు అందించిన సేవలు ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు. రాజకీయం, ప్యాకేజీల కోసం మీ మదర్‌ను, ఫ్యామిలీని జనసేన నాయకులను తిట్టిన వారిని వెనకేసుకు రావడం పవన్‌కే చెల్లిందని విమర్శించారు. వారాహి అనే అమ్మవారి పేరిట చేపట్టిన వాహనంపై చెప్పులు వేసుకుని, ఇష్టారీతిన ప్రత్యర్థులను తిట్టడం శోచనీయమని అన్నారు. ఇదిలావుంటే పవన్ వ్యాఖ్యలపై వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. పవన్ వెంటనే క్షమాపణ చెప్పాలని నిరసన డిమాండ్ చేస్తున్నారు.