జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర చేపట్టనున్నారు. అక్టోబర్ నుంచి ఆయన బస్సు యాత్రను ప్రారంభిస్తారని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. విజయదశమి సందర్భంగా అక్టోబర్ 5 నుంచి పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర చేపడతారని నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఈ యాత్రలో పవన్ కళ్యాణ్ ఎండగడతారని చెప్పుకొచ్చారు. జగన్ పాలనలో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని.. మరోసారి జగన్ అధికారంలోకి రాకూడదని ప్రజలు భావిస్తున్నారని నాదెండ్ల మనోహర్ అన్నారు. ప్రణాళిక లేని పాలన వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని.. ఓటు బ్యాంకు రాజకీయాలే ప్రధానంగా జగన్ పాలన సాగిస్తున్నారని నాదెండ్ల మనోహర్ విమర్శించారు.
మంత్రి రోజా మాట్లాడుతూ అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు బస్సు యాత్ర ఎందుకు చేయాలనుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. జనసేన పెట్టింది పార్టీ కార్యకర్తల కోసమా.. జనం కోసమా అనే స్పష్టత లేదని అన్నారు. మహానాడులో తొడగోట్టి రమ్మని పిలిచిన టీడీపీ నేతలు.. జూమ్ మీటింగ్ కు కొడాలి నాని, వంశీ వస్తే లోకేశ్ ఎందుకు పారిపోయారని ప్రశ్నించారు. లోకేష్‌కు అసెంబ్లీకి వచ్చి మాట్లాడే అవకాశం ఎప్పటికీ రాదని జోస్యం చెప్పారు రోజా. కరోనా వైరస్ వలన స్కూళ్లు నడవకపోవడం.. విద్యార్థులు సరిగ్గా చదవకపోవడం వల్ల ఫెయిలయ్యారని మంత్రి రోజా చెప్పారు. దీనిని ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని ఆమె అన్నారు.