నేను అమ్ముకున్నానా.. ఫైర్ అయిన మంత్రి రోజా

పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పదవి కోసం మంత్రి రోజా రూ.70 లక్షల డబ్బు డిమాండ్ చేశారని కొద్దిరోజుల కిందట భువనేశ్వరి అనే మహిళ ఆరోపించారు

By Medi Samrat  Published on  29 Jan 2024 2:22 PM GMT
నేను అమ్ముకున్నానా.. ఫైర్ అయిన మంత్రి రోజా

పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పదవి కోసం మంత్రి రోజా రూ.70 లక్షల డబ్బు డిమాండ్ చేశారని కొద్దిరోజుల కిందట భువనేశ్వరి అనే మహిళ ఆరోపించారు. రోజా సోదరుడు కుమారస్వామిరెడ్డికి మూడు విడతల్లో రూ.40 లక్షలు ఇచ్చానని.. చైర్మన్ పదవి ఇవ్వకపోగా, తాను చెల్లించిన డబ్బు కూడా తిరిగి ఇవ్వలేదన్నారు. రోజా సోదరుడు కుమారస్వామిరెడ్డి పంపిన సత్య అనే వ్యక్తికి డబ్బులు ఇచ్చానని తెలిపారు. దీనిపై మంత్రి రోజాకు మెసేజ్ చేస్తే కనీస స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను వైసీపీ కౌన్సిలర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యానని, రిజర్వేషన్ కూడా ఉండడంతో చైర్మన్ పదవి నీదేనని నమ్మించారని భువనేశ్వరి ఆరోపించారు.

ఈ ఆరోపణలపై మంత్రి ఆర్కే రోజా స్పందించారు. తనపై మాట్లాడిన వారందరూ కాలగర్భంలో కలసిపోయారని అన్నారు రోజా. పదేళ్ళుగా ఎక్కడైనా తప్పు చేశాననో, ఒకరి దగ్గర ఒక్క రూపాయి తీసుకున్నానో నిరూపించగలరా అని ప్రశ్నించారు. జగన్ మీదా ఆయన సొంత చెల్లిలే విమర్శలు చేసినప్పుడు, తనమీద ఎందుకు చేయరని రోజా ప్రశ్నించారు. కౌన్సిలర్ భువనేశ్వరికి పదవి ఇస్తే అమ్ముడుపోయి.. తననే విమర్శిస్తున్నారని మంత్రి తెలిపారు. ఆమెకు కౌన్సిలర్ గా అవకాశం ఇచ్చింది వైసీపీనేనని అన్నారు. భువనేశ్వరికి రాజకీయ అర్హత లేకపోయినా వారికి అవకాశం ఇచ్చామని మంత్రి రోజా తెలిపారు. కృతజ్ఞత లేకుండా దేనికో లొంగి తన మీద నింద వేశారని అన్నారు. అలాంటి వాళ్లందరికీ భగవంతుడే సమాధానం చెబుతాడన్నారు.

Next Story