విశాఖ ఎయిర్‌పోర్టు వద్ద మంత్రులపై జరిగిన దాడి ఘటనపై మంత్రి విడదల రజినీ స్పందించారు. జనసేన కార్యకర్తలు కావాలనే మంత్రులపై దాడి చేశారని ఆమె ఆరోపించారు. జేఏసీ పిలుపు ఇచ్చిన గర్జన కార్యక్రమాన్ని చాలా క్రమశిక్షణతో నిర్వహించారని మంత్రి విడుదల రజినీ తెలిపారు. కానీ జనసేన కార్యకర్తలు మాత్రం ఇబ్బందికరమైన వాతావరణాన్ని సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను లెక్కచేయకుండా జనసేన కార్యకర్తలు ప్రవర్తించారని మండిపడ్డారు.
జనవాణిని అడ్డుకోవాలని భావిస్తే ఇప్పటివరకు నాలుగు జనవాణిలు జరిగి ఉండేవి కావన్నారు. ఎయిర్ పోర్ట్ దగ్గర ట్రాఫిక్‌లో తాను ఇరవై నిమిషాలు ఇరుక్కుపోయానని.. జనసేన కార్యకర్తలు తన కారు చుట్టూ చేరి అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తూ కర్రలతో కొట్టారని మంత్రి విడదల రజినీ తెలిపారు. విశాఖ గర్జన గ్రాండ్ సక్సెస్ అయ్యిందనే కారణంతో జనసేన పక్కదారి పట్టించాలని ప్రయత్నం చేసిందన్నారు. ఉద్దేశపూర్వకంగానే వారు దాడులకు పాల్పడ్డారని.. ఇలా దాడి చేస్తారని తాము ఊహించలేదన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని విడదల రజని అన్నారు.