ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల అమ్మకాలపై మంత్రి పేర్ని నాని స్పందన ఇదే..!
Minister Perni Nani Comments On Movie Tickets Sale. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్లు అమ్మబోతోందనే ప్రచారం ఇటీవలి కాలంలో సాగింది.
By Medi Samrat Published on 14 Sept 2021 4:41 PM IST
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్లు అమ్మబోతోందనే ప్రచారం ఇటీవలి కాలంలో సాగింది. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి పేర్ని నాని స్పందించారు. ప్రభుత్వం టికెట్ల వ్యాపారం చేస్తోందని ప్రతిపక్షం దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. సినిమా టికెట్ల వివాదాన్ని త్వరలోనే పరిష్కరిస్తామని, నిర్ణయించిన ధరలకే టికెట్లను ఆన్ లైన్ లో ఉంచుతామని వెల్లడించారు. సినీ ఇండస్ట్రీ పెద్దలు సీఎం జగన్ తో సమావేశమవుతామని కోరారని, ఆగస్టులో భేటీ కావాలని భావించినా కుదరలేదని తెలిపారు. త్వరలోనే సినీ ప్రముఖులు సీఎం జగన్ ను కలుస్తారని పేర్కొన్నారు. ప్రజలకు మేలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. టికెట్ ధర, అధిక సంఖ్యలో ప్రదర్శనలపై నియంత్రణ విధిస్తూ ఏప్రిల్ 8న జీవో తీసుకువచ్చామని వెల్లడించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే టికెట్లు అమ్మాలని ఆదేశించామని తెలిపారు. ఆన్ లైన్ టికెటింగ్ పై అధ్యయనానికి కమిటీ కూడా ఏర్పాటు చేసినట్టు మంత్రి పేర్ని నాని వివరించారు. ఆన్ లైన్ టికెటింగ్ పై అర్థంపర్థం లేని విమర్శలు చేస్తున్నారని, ఆన్ లైన్లో టికెట్లు అమ్మవచ్చని గత ప్రభుత్వమే నిర్ణయించిందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ నిర్ణయానికి తెలుగు ఫిలిం చాంబర్ కూడా అంగీకారం తెలిపిందని అన్నారు.
ఇక ఆంధ్రప్రదేశ్‌లో మటన్ మార్ట్‌ల ఏర్పాటు ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో లేదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి అప్పలరాజు చెప్పారు. ఈ విషయంలో విపక్షాలు, ఎల్లో మీడియా అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. సర్టిఫై చేసిన మత్స్య ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ఇప్పటికే ఆక్వాహబ్‌లు, స్పోక్స్, మినీ అవుట్‌లెట్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అదేరీతిలో అపరిశుభ్ర వాతావరణంలో అమ్మకాలు జరుగుతున్న మాంసపు ఉత్పత్తులను సర్టిఫై చేసి పరిశుభ్ర వాతావరణంలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని శాఖాపరంగా ఆలోచన చేసినట్లు పేర్కొన్నారు. ఇది శాఖాపరంగా పరిశీలనలో ఉందే తప్ప ప్రతిపాదనస్థాయిలోగానీ, ప్రభుత్వ పరిశీలనలోగానీ లేదని పేర్కొన్నారు.