బీజేపీకి అడ్రెస్ లేదు.. కాంగ్రెస్ పునాదులు కదిలిపోయాయి

Minister Peddireddy Ramchandrareddy Comments On Congress BJP. బద్వేలు ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేస్తున్నామ‌ని మంత్రి పెద్దిరెడ్డి

By Medi Samrat  Published on  9 Oct 2021 12:17 PM GMT
బీజేపీకి అడ్రెస్ లేదు.. కాంగ్రెస్ పునాదులు కదిలిపోయాయి

బద్వేలు ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేస్తున్నామ‌ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ పునాదులు కదిలిపోయాయని.. బీజేపీ కి అడ్రెస్ లేదని.. ఇలాంటి పార్టీలతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నామ‌ని ఎద్దేవా చేశారు. మా ముఖ్యమంత్రి కులాలు, మతాలు, ప్రాంతాలు , పార్టీలు చూడకుండా సంక్షేమం అందిస్తున్నారని.. అడ్రెస్ లేని పార్టీలు, గల్లంతయిన పార్టీలు ఏ అర్హతతో ఓట్లు అడుగుతారని ప్ర‌శ్నించారు. బద్వేలు నియోజకవర్గ అభివృద్ధికి రూ.792 కోట్లు కేటాయించామని.. తాగునీటి సమస్య శాశ్వత పరిష్కరం కోసం బ్రహ్మం సాగర్ ద్వారా పనులు చేస్తున్నామ‌ని తెలిపారు.

నియోజకవర్గ పరిధిలో ఐదు వేల ఇల్లు ఇచ్చామ‌ని.. నియోజకవర్గ అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. మేము చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమం చెప్పేందుకు ప్రతి ఇంటికి వెళతామ‌ని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా మా ముఖ్యమంత్రి సమపాళ్లతో అభివృద్ధి చేస్తున్నారని.. బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. రూ.75 వేల కోట్లు అప్పులు తెచ్చామని అంటున్నారు.. 75 కాదు లక్ష కోట్లు సంక్షేమ పథకాల కోసం ఇచ్చామ‌ని.. అప్పులు ఎక్కువ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.. కరోనా సంక్షోభంలో ప్రజలకు అండగా నిలిచామని అన్నారు. నోబెల్ గ్రహీత అమర్థ్య సేన్ చెప్పినట్లు హెలికాప్టర్ మనీ ద్వారా కరోనా సంక్షోభంలో అందరినీ అదుకున్నామ‌న్నారు.

హోం మంత్రి క్రిస్టియన్ అని తప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని.. అభూత కల్పనలు చెప్పడంలో ఆరితేరారని ఫైర్ అయ్యారు. తిరుపతి ఉపఎన్నికల్లో కూడా బీజేపీ నేతలు తప్పడు ప్రచారాలు చేసి మభ్యపెట్టే ప్రయత్నాలు చేసారని.. ఎన్నికలు సాఫీగా జరుపుకోవాలని బీజేపీకి లేదని అన్నారు. దేవాలయాలు కొట్టేస్తున్నారని ఆరోపించారు.. టీడీపీ ప్రభుత్వంలో బీజేపీ పార్టీ దేవాదాయశాఖ మంత్రిగా ఉండి విజయవాడలో దేవాలయాలను విధ్వంసం చేశారని అన్నారు. మాది సెక్యూలర్ పార్టీ.. మాకు కులాలు, మతాలు లేవు.. హిందు మతం అడ్డం పెట్టుకొని బీజేపీ రాజకీయం చేస్తోంద‌ని మండిప‌డ్డారు. ఓట్లు లేవు కాబట్టి ఎదో ఒక రచ్చ చేయడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలనే బీజేపీ ప్రయత్నిస్తోంద‌ని అన్నారు. బీజేపీ నేత సునీల్ థియోదర్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని.. టీడీపీ నుంచి వెళ్లిన తాబేదార్లు రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మతతత్వం పేరుతో రెచ్చకొట్టే ప్రయత్నాలు చేస్తున్నార‌ని.. మాపై ఆరోపణలు చేయడం మీ తెలివితక్కువ తనమ‌ని.. ఆరోపణలు చేసేముందు తెలుసుకొని మాట్లాడాల‌ని సూచించారు.


Next Story
Share it