లోకేశ్‌కు కనీస లోక జ్ఞానం కూడా లేదు : మంత్రి పెద్దిరెడ్డి
Minister Peddireddy Ramachandrareddy Fire On Nara Lokesh. టీడీపీ నేత నారా లోకేశ్‌పై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.
By Medi Samrat Published on 19 Aug 2022 1:30 PM GMTటీడీపీ నేత నారా లోకేశ్‌పై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. నారా లోకేశ్‌కు కనీస లోక జ్ఞానం కూడా లేదని మంత్రి ఎద్దేవా చేశారు. అవివేకం, అనుభవ రాహిత్యం, అజ్ఞానంతోనే లోకేశ్ ప్రేలాపనలు చేస్తున్నారని.. చంద్రబాబు హయాంలో యువతకు ఉద్యోగావకాశాలు కల్పించలేదని ఆరోపించారు. ఇలాంటి నేపథ్యంలో తమ ప్రభుత్వ హయాంలో కొత్తగా ఉద్యోగాలు పొందిన యువతపై మాట్లాడే అర్హత లోకేశ్‌కు లేదని స్పష్టం చేశారు. ఎనర్జీ అసిస్టెంట్లకు విధుల కేటాయింపుపై లోకేశ్ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని.. నిబంధనల ప్రకారమే ఎనర్జీ అసిస్టెంట్లకు విధులు కేటాయించామని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని మరిచిన లోకేశ్ చేసిన వ్యాఖ్యలు ఎనర్జీ అసిస్టెంట్ల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎనర్జీ అసిస్టెంట్లపై ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. ఎనర్జీ అసిస్టెంట్లు, జేఎల్‌ఎం గ్రేడ్-2 ఉద్యోగుల సమస్యలపై తక్షణమే స్పందించి పరిష్కరించాలని లేఖలో పేర్కొన్నారు. ఎనర్జీ అసిస్టెంట్ల న్యాయమైన డిమాండ్లు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జాబ్ ఛార్ట్‌ని విస్మరించి కట్టుబానిసల్లా వాడుకోవడంతో ఎనర్జీ అసిస్టెంట్లు తీవ్ర మానసిక ఆందోళనలో ఉన్నారని లోకేష్ ఆరోపించారు. సెలవులు, పండగలు, పబ్బాల ఊసే లేకుండా చేశారని.. దీంతో రాత్రి, పగలు తేడా లేకుండా పని చేయిస్తుండడంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని అన్నారు. శిక్షణ కూడా లేని వీరిని ప్రమాదకరమైన 11కేవీ 33 కేవీ విద్యుత్ లైన్ల మరమ్మతులకు, స్థంభాలు ఎక్కిస్తుండడంతో ప్రాణాలు సైతం కోల్పోతున్నారని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇండస్ట్రియల్ యాక్ట్ కింద ఉండాల్సిన నియామకాలను సచివాలయం కింద చూపిస్తూ…లేబర్ యాక్ట్ అమలు చేయడంతో ప్రాణాలు కోల్పోయిన, ప్రమాదాలకి గురైన ఎనర్జీ అసిస్టెంట్లు పరిహారంలోనూ అన్యాయానికి గురయ్యారని లోకేష్ తన లేఖలో వివరించారు.