గుడ్‌న్యూస్.. మార్చిలో లబ్దిదారులకు ఇళ్ల తాళాలు అందిస్తాం
రానున్న 5 సంవత్సరాలలో రాష్ట్రంలోని అర్హత కలిగిన ప్రతీ పేదవానికి ఇల్లు అందించాలన్న ఆశయంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కృతనిశ్చయంతో ఉన్నారని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు.
By Medi Samrat Published on 21 Jan 2025 6:45 PM ISTరానున్న 5 సంవత్సరాలలో రాష్ట్రంలోని అర్హత కలిగిన ప్రతీ పేదవానికి ఇల్లు అందించాలన్న ఆశయంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కృతనిశ్చయంతో ఉన్నారని, మార్చిలో లక్ష గృహల నిర్మాణాలను పూర్తిచేసి, లబ్దిదారులకు ఇంటి తాళాలు అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చేపడతారని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు.
ఏలూరు మండలం పోణంగిలో ఎన్టీఆర్ గృహ లేఔట్ ను మంగళవారం స్థానిక ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి), జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, గృహ నిర్మాణ అధికారులతులతో కలిసి మంత్రి పరిశీలించారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుగుకున్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు తమ ఇళ్లకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని, త్రాగునీరు, డ్రైనేజి సౌకర్యాలు కల్పించాలని కోరారు.
ఈ సందర్భంగా లేఔట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పధకం కింద అర్హులైన ప్రతీ నిరుపేదకు స్వంత గృహం అందించాలన్న ఆశయంతో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఉన్నారని, వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. మార్చిలోగా రాష్ట్రంలో లక్ష గృహాల నిర్మాణాలను పూర్తి చేసి.. లబ్దిదారులకు తాళాలు అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చేపట్టనున్నారన్నారు. పోణంగి లేఔట్ లో 7,035 గృహాలకు గాను, 5667 మంది లబ్దిదారులకు మంజూరు పత్రాలను మంజూరు చేయడం జరిగిందని, 875 ప్రారంభించారన్నారు.
ఎన్టీఆర్ గృహ లేఔట్ లలో మౌలిక సదుపాయాలు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలనీ, లబ్ధిదారులు గృహప్రవేశాలకు అనుగుణంగా గృహాలు సిద్ధం చేయాలనీ అధికారులను మంత్రి ఆదేశించారు. లేఔట్ లో పనుల నిమిత్తం ఇసుక కొరత లేకుండా వారం రోజుల్లో లేఔట్ లో స్టాక్ పాయింట్ ను ఏర్పాటు చేస్తామన్నారు. 80 శాతానికిపైగా నిర్మాణపనులు పూర్తయిన గృహాలను పూర్తిచేయడంలో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పోణంగి లేఔట్ లో మార్చ్ నాటికి రెండు వేల గృహాలు సిద్ధంచేయాలని మంత్రి గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. లేఔట్లలోని గృహాలకు విద్యుత్, త్రాగునీరు, డ్రైనేజి పనులను కాంట్రాక్టర్లు నిర్దేశించిన సమయంలో పూర్తిచేసేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు. పనులు పూర్తికావడంతో అధికారుల పర్యవేక్షణ లోపం ఉంటె సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటానని మంత్రి హెచ్చరించారు. విద్యుత్ సమస్యలు కూడా పరిష్కరిస్తామన్నారు. ఏలూరు నియోజకవర్గంలో సుమారు 25 వేల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని పట్టుదలతో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి కృషి చేస్తున్నారన్నారు.
ఇళ్ల నిర్మాణానికి డ్వాక్రా మహిళలకు ఇచ్చే రుణాన్ని 35 వేల రూపాయల నుండి లక్ష రూపాయలకు పెంచే అంశాన్ని, అదే విధంగా ఎస్.సి., ఎస్టీలకు గృహ నిర్మాణానికి 50 వేలు, 75 వేల రూపాయలు అదనంగా అందించే విషయాన్నీ ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నారన్నారు. ఇల్లు మంజూరైన లబ్ధిదారులు 2026, డిసెంబర్ నాటికి ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేసుకోవాలని, లేనియెడల గృహ మంజూరు రద్దు చేయడం జరుగుతుందన్నారు. కావున లబ్ధిదారులు తమ గృహాల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.