పోలవరం అవినీతిపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తాం : మంత్రి నిమ్మల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడైన పోలవరం ప్రాజెక్టు ఏడాది లోగా పూర్తి కావాల్సి ఉండగా.. గత ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రాజెక్టు పనులను అస్తవ్యస్తం చేసి పదేళ్ళు వెనక్కి నెట్టిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామా నాయుడు ఆరోపించారు

By Medi Samrat  Published on  20 Jun 2024 2:50 PM IST
పోలవరం అవినీతిపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తాం : మంత్రి నిమ్మల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడైన పోలవరం ప్రాజెక్టు ఏడాది లోగా పూర్తి కావాల్సి ఉండగా.. గత ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రాజెక్టు పనులను అస్తవ్యస్తం చేసి పదేళ్ళు వెనక్కి నెట్టిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామా నాయుడు ఆరోపించారు. గురువారం రాష్ట్ర సచివాలయం నాల్గవ బ్లాకులో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రిగా రామానాయుడు పదవీ బాధ్యతలు స్వీకరించారు.

ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఐదేళ్ళ కాలంలో నీటి పారుదల వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని అన్నారు. ముఖ్యంగా ఏడాది వ్యవధిలో పూర్తి కావాల్సిన పోలవరం ప్రాజెక్టును జగన్ ప్రభుత్వం పదేళ్ళకు వెనక్కి నెట్టిందని ఆరోపించారు. అదే విధంగా 2019కి ముందు పోలవరం ప్రాజెక్టులో చేసిన పనులకు కేంద్ర ప్రభుత్వం రీఇంబర్సు మెంట్ కింద విడుదల చేసిన నిధులను వేరే అవసరాలకు మళ్ళించిందని అన్నారు. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన వెంటనే తొలి క్షేత్ర స్థాయి పర్యటనగా పోలవరం సందర్శించారంటే పోలవరం ప్రాజెక్టుకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తున్నారో తెలుస్తోందని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టులో గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం, అవినీతిపై త్వరలో శ్వేత పత్రం విడుదల చేస్తామని మంత్రి రామానాయుడు స్పష్టం చేశారు.

గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే పోలవరం ప్రాజెక్టులో భాగమైన డయఫ్రమ్ వాల్ కొట్టుకు పోయిందని హైదరాబాదు ఐఐఐటి నీతి ఆయోగ్ కు నివేదిక ఇచ్చిందని తెలిపారు. మరలా దానికి మరమ్మత్తులు చేయాలన్నా కనీసం 440 కోట్ల రూ.లు అవుతుందని.. ఒకవేళ కొత్తగా నిర్మించాలన్నా సుమారు 990 కోట్ల రూ.లకు పైగా వ్యయం అవుతుందని మంత్రి రామానాయుడు పేర్కొన్నారు. దీనిపై సవివరంగా సమీక్షించి మరమ్మత్తులు చేయాలా లేక కొత్తగా నిర్మించాలా అనేదానిపై తగు నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని అన్నారు.

Next Story