విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన ఆస్తులపై మంత్రి నారాయణ సమీక్ష
రాష్ట్ర పునర్విభజన జరిగి పదేళ్లు పూర్తయింది.చట్టంలో పేర్కొన్నట్లుగా హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు కూడా ముగిసింది.
By Medi Samrat Published on 29 Jun 2024 9:06 PM ISTరాష్ట్ర పునర్విభజన జరిగి పదేళ్లు పూర్తయింది.చట్టంలో పేర్కొన్నట్లుగా హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు కూడా ముగిసింది. అయినప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉమ్మడి ఆస్తుల విభజన ఇంకా పూర్తి కాలేదు.. ఇప్పటికే వేల కోట్ల ఆస్తులు ఉన్న సంస్థల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది.. ముఖ్యంగా తొమ్మిది, పదో షెడ్యూల్ లో ఉన్న సంస్థల మధ్య విభజన ఇంకా కొలిక్కి రావడం లేదు. ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్నట్లు ఆంధ్ర ప్రదేశ్ - తెలంగాణ రాష్ట్రాలు జనాభా ప్రాతిపదికన ఆస్తులు, అప్పులు పంపిణీ చేసుకోవాలని ఉంది.. కానీ ఆ తర్వాత పంపకాల విషయంలో ఎక్కడ ఉన్నవి ఆ రాష్ట్రానికే చెందాలని తెలంగాణ ప్రభుత్వం కొత్త అంశాన్ని తెరమీదకు తెచ్చింది. దీంతో ఇప్పటికీ కొన్ని సంస్థలు విషయంలో పీటముడి వీడటం లేదు. ఇలాంటి సంస్థల్లో కొన్ని సంస్థలు మున్సిపల్ శాఖకు చెందినవి కూడా ఉన్నాయి.. అలాంటి సంస్థలపై పురపాలక - పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ అధికారులతో సమీక్ష చేశారు. విజయవాడలోని సీఆర్దీయే ప్రధాన కార్యాలయంలో హౌసింగ్ బోర్డు, సంబంధిత అధికారులతో మంత్రి నారాయణ చర్చించారు.
షీలా బిడే కమిటీ నివేదిక ప్రకారమే ముందుకెళ్లాలని నిర్ణయం
హైదరాబాద్ లో ఉన్న ఏపీ హౌసింగ్ బోర్డు, డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ హోల్డింగ్స్ ఆస్తులపై గతంలోనే ఆస్తులు, అప్పులు జనాభా ప్రాతిపదికన విభజించడమైంది. విభజన ప్లాన్ ను కూడా అధికారుల కమిటీ ముందుంచారు. సదరు ప్లాన్ ను పరిశీలించిన తర్వాత ఎక్స్ పర్ట్ కమిటీ కొన్ని సిఫార్సులు చేసింది.. ఈ సిఫార్సులను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లగా అక్కడ ప్రస్తుతం పెండింగ్ లో ఉన్నట్లు అధికారులు వివరించారు. ఏపీ హౌసింగ్ బోర్డు లెక్కల ప్రకారం తెలంగాణ నుంచి సుమారు 5170 కోట్లు ఆంధ్రప్రదేశ్ కు రావాల్సి ఉంది.ఆయా సంస్థల ఆస్తులకు సంబంధించి సుప్రీంకోర్టు,హై కోర్టుల్లో ఉన్న కేసులను కూడా త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశానికి పురపాలక - పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ హాజరయ్యారు.