విశాఖ విషయంలో మంత్రి నారా లోకేష్ భారీ హామీ

గత వైసీపీ ప్రభుత్వం విశాఖపట్నం రాజధాని అంటూ ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.

By Medi Samrat  Published on  25 Sep 2024 10:14 AM GMT
విశాఖ విషయంలో మంత్రి నారా లోకేష్ భారీ హామీ

గత వైసీపీ ప్రభుత్వం విశాఖపట్నం రాజధాని అంటూ ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో గెలిచాక వైజాగ్ నుండి పాలన సాగిస్తామని వైసీపీ అధినేత వైఎస్ జగన్ చెప్పారు. అయితే ఎన్నికల ఫలితాలు విశాఖపట్నం భవిష్యత్తుపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమయ్యేందుకు కారణం అయ్యాయి. తాజాగా ఏపీ మంత్రి నారా లోకేష్ విశాఖపట్నం అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు.

విశాఖ నోవాటెల్‌లో సీఐఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. భవిష్యత్తులో విశాఖకు ఏం చేయాలి? మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశాలపై చర్చించామన్నారు. భోగాపురం విమానాశ్రయం నిర్మాణంతో పాటు భోగాపురానికి రోడ్డు, మెట్రో కనెక్టివిటీపై చర్చించామన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ భాగంలో ఒక్కో జిల్లాకు ఒక్కో ఫోకస్ ఏరియా గతంలోనే టీడీపీ ప్రభుత్వం రూపొందించిందన్నారు. గత ప్రభుత్వ విధానాల కారణంగా పారిశ్రామికవేత్తలు వెనక్కి వెళ్లిపోయారన్నారు. ఎకనామిక్ యాక్టివిటీ మొత్తం రివైజ్ చేయాలని, మౌలిక సదుపాయాలపై పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టాలన్నారు.

రాబోయే రోజుల్లో పెద్దఎత్తున విశాఖలో పెట్టుబడులు రాబోతున్నాయన్నారు. విశాఖను ఇతర రాష్ట్రాలతో పోటీపడే విధంగా చేస్తామన్నారు. విశాఖలో ఉన్న ఐటీ కంపెనీలతో సమావేశమై వారికున్న సమస్యలపై చర్చించామని, వాటిని పరిష్కరించామని కూడా నారా లోకేష్ చెప్పారు. రాబోయే వంద రోజుల్లో ఐటీ, జీసీసీ పాలసీ తీసుకువస్తామని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఐటీ పెట్టుబడులు తీసుకువస్తామన్నారు. ఎమర్జింగ్ టెక్నాలజీస్‌పై దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. డేటా సెంటర్ల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నామని, గతంలో ఓ సంస్థతోనూ ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు.

Next Story