ఏ ఒక్క రైతు అధైర్యపడవద్దు.. కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది : మంత్రి నాదెండ్ల మనోహర్

'రైతు పండించిన చివరి బస్తా వరకు కొనుగోలు చేసే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రతి బస్తాకు కనీస మద్దతు ధర చెల్లించే కొనుగోలు చేసే బాధ్యతను తీసుకుంటుంద'ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ భరోసా ఇచ్చారు.

By Medi Samrat  Published on  4 Dec 2024 3:45 PM GMT
ఏ ఒక్క రైతు అధైర్యపడవద్దు.. కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది : మంత్రి నాదెండ్ల మనోహర్

'రైతు పండించిన చివరి బస్తా వరకు కొనుగోలు చేసే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రతి బస్తాకు కనీస మద్దతు ధర చెల్లించే కొనుగోలు చేసే బాధ్యతను తీసుకుంటుంద'ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ భరోసా ఇచ్చారు. మిల్లర్లు రైతులకు ఇబ్బందులు కలగకుండా తమ వంతు సహకారం అందించాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చూడాలన్నారు. కనీస మద్దతు ధర వ్యవహారంలో అవకతవకలకు పాల్పడితే సహించమని హెచ్చరించారు. మిల్లర్ల వద్ద మోసం జరిగిందన తెలిస్తే అలాంటి వారిని బ్లాక్ లిస్టులో పెడతామన్నారు.

వాతావరణ పరిస్థితులను అడ్డుపెట్టుకుని కొంత మంది దళారులు రైతులను ఇబ్బంది పెడుతున్నారని, కనీస మద్దతు ధర కంటే తక్కువ చెల్లించి కొనుగోలు చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని తెలిపారు. బుధవారం కృష్ణా జిల్లా, అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలో ధాన్యం కొనుగోళ్లపై క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపారు. చల్లపల్లి, ఘంటసాల మండలాల పరిధిలో స్థానిక శాసన సభ్యుడు మండలి బుద్దప్రసాద్ తో కలసి రోడ్లపై ఆరబోసిన ధాన్య రాసుల వద్ద రైతులతో ముచ్చటించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అవనిగడ్డలో ధాన్యం కొనుగోళ్లపై రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ "అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోని ఆరు మండలాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను క్షేత్ర స్థాయిలో పరిశీలించాము. ఇక్కడ రైతాంగం ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వానికే ధాన్యం అమ్మేందుకు వేచిచూస్తున్నారు. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా 40 రోజులపాటు సాగాల్సిన ధాన్యం కొనుగోలు ప్రక్రియ మూడు రోజుల్లో చేపట్టాల్సి రావడంతో కొంత మేర ఇబ్బందులు తలెత్తాయి. ఆ ఇబ్బందులన్నింటినీ అధిగమించి రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసే ప్రక్రియ ప్రారంభించాము. రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోపే డబ్బు వారి ఖాతాల్లో జమ అయిపోతుంది. 24 గంటల్లో 93 శాతం రైతులకు డబ్బు వారి ఖాతాల్లో పడిపోయింది.రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు రూ. 2,800 కోట్ల విలువ చేసే ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఒక్క కృష్ణా జిల్లాలోనే లక్షా 24 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాము. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రైతుకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఎక్కడా పొరపాటు లేకుండా రైతుకు అండగా నిలబడుతుంది. రైతుని రాజు చేయడమే లక్ష్యంగా మేమంతా పని చేస్తాము.

తొలిసారి కౌలు రైతులకు ఈ క్రాఫ్ నమోదు సౌకర్యం

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు అండగా నిలబడాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తుంది. గత ప్రభుత్వం రూ. 11 లక్షల కోట్లు అప్పులు చేసి వెళ్లింది. ఒక్క పౌరసరఫరాల శాఖలోనే రూ. 41,150 కోట్ల అప్పులు చేశారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేపట్టిన మొట్టమొదటి కార్యక్రమమే రైతులకు అండగా చేపట్టాము. అన్నింటికీ సిద్ధమని చెప్పిన గత ముఖ్యమంత్రి రైతులకు రూ.1674 కోట్ల ధాన్యం బకాయిలు వదిలేసిపోయారు. ఆర్థిక ఇబ్బందులున్నా ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోపే రైతుల బకాయిలు చెల్లించాము. ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంలోనూ ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చాము. రైతు భరోసా కేంద్రాలను రైతు సహాయ కేంద్రాలుగా మార్చి అధికారులను క్షేత్ర స్థాయిలో రైతులకు అందుబాటులో ఉంచాము. తొలిసారి కౌలు రైతులకు కూడా ఈ-క్రాఫ్ నమోదుకు అవకాశం కల్పించాము. కౌలు రైతులకు నేరుగా అకౌంట్లలో డబ్బు జమ అయ్యే విధంగా చర్యలు తీసుకున్నాము. గత ప్రభుత్వ హయాంలో ధాన్యం ఏ మిల్లుకు తీసుకువెళ్లాలనేది రైతు చేతిలో ఉండేది కాదు. సుదూర ప్రాంతాలకు ధాన్యాన్ని సొంత ఖర్చులతో తరలించి మిల్లుల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితులు ఉండేవి. అలాంటి ఇబ్బందులను అధిగమించి రైతే మిల్లర్ ను ఎంచుకునే వెసులుబాటు కూటమి ప్రభుత్వం కల్పించింది.

కనీస మద్దతు ధర రూ. 1725కి ధాన్యం కొనుగోలు చేస్తున్నాము. కొంత మంది దళారులు వర్షాలు వచ్చాక రైతులను మభ్యపెట్టి రూ. 1400 కి కొనే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. తేమ శాతం కూడా కొంచెం అటూ ఇటుగా ఉన్నప్పటికీ కొనుగోలు చేయాలని ఆదేశించాము. అత్యవసర పరిస్థితులలో 25 శాతం తేమ ఉన్న ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని అధికారులకు సూచించాము. రైతులకు తమ వంతు సహకారం అందించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు టార్పాలిన్లు, గోతాలు అందుబాటులో ఉంచి ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మిల్లర్ల నుంచి కూడా సహకారం అవసరం. మిల్లర్ దగ్గర అన్యాయం జరిగిందన్న భావన రైతులకు కలగకూడదు. రూ. 1725 కనీస మద్దతు ధరకు రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, మిల్లర్లకు సైతం ఉంది. కృష్ణా జిల్లావ్యాప్తంగా ఉన్న మిల్లుల్లో సగం మిల్లుల్లోనే డ్రయ్యర్లు ఉన్నాయి. మిల్లర్లు డ్రైయింగ్ విషయంలో రైతులను ఇబ్బంది పెట్టవద్దు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే రూ.9 సబ్సిడి మిల్లర్లకే చెల్లిస్తాము. కృష్ణా జిల్లావ్యాప్తంగా మొత్తం 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకుంటే, కొనుగోళ్లు రెండు రోజుల్లోనే లక్ష మెట్రిక్ టన్నులు దాటింది. కొంత మంది దళారులు చేసిన ప్రచారం కారణంగా రైతులు ప్రభుత్వం కొనుగోళ్లు జాప్యం జరుగుతుందన్న భావనలో ఉన్నారు. రైతులు అలాంటి అపోహలు పెట్టుకోవద్దు. ప్రతి గింజా ప్రభుత్వమే కొంటుంది. కొన్న 24 గంటల్లోనే సొమ్ము చెల్లిస్తుంది. కొంత మంది రైతులకు ధాన్యం అమ్మిన 8 గంటల్లోనే వారి ఖాతాల్లో డబ్బు జమ అయిపోతోంది. ఈ విషయంలో చాలా మంది రైతులు ఆనందం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు పని చేస్తుంది. రైతులకు అండగా ఉంటుంది.

వచ్చే ఖరీఫ్ నాటికి సమస్యలన్నీ అధిగమిస్తాం

గడచిన ఐదేళ్లలో రైతులు అధికారులతో మాట్లాడి తమ సమస్యలు చెప్పుకొనే పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం అధికారులనే రైతుల చెంతకు పంపుతోంది. దేశంలో మొట్ట మొదటిసారి ఏఐ టెక్నాలజీ సాయంతో రైతుల సౌలభ్యం కోసం టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చాము. ఆ నంబర్ కి రైతు వాట్సప్ లో హాయ్ పెడితే చాలు ఎవ్వరితో సంబంధం లేకుండా ధాన్యం అమ్ముకునే వెసులుబాటు కల్పించాము. 7337359375 కి హాయ్ పెట్టి రైతు నేరుగా ధాన్యాన్ని అమ్ముకోవచ్చు. ఈ ప్రాంతంలో పండే బీపీటీ 1262తో పాటు కొన్ని నంబర్ల గురించి ఆందోళన ఉంది. ఉదయం అధికారులతో సమీక్షించి రకంతో సంబంధం లేకుండా ప్రతి గింజా రైతు నుంచి కొనుగోలు చేయాల్సిందేని ఆదేశాలిచ్చాము. రైతుకు చిన్న ఇబ్బంది కూడా కలుగకుండా, ఎక్కడా పొరపాటు లేకుండా చూస్తున్నాము. గోతాల విషయంలోనూ అధైర్యపడవద్దు. రైతుకు కులం, రాజకీయంతో సంబంధం లేదు. రైతుకు ప్రతి ఒక్కరు గౌరవం ఇవ్వాల్సిందే. గతంలో పవన్ కళ్యాణ్ ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు రూ. లక్ష చొప్పున ఆర్ధిక సాయం అందించారు. మా ప్రభుత్వంలో నిజాయితీ ఉంది. వచ్చే ఖరీఫ్ నాటికి సమస్యలు అధిగమిస్తాం. కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి ప్రభుత్వం తరఫున డ్రయ్యర్ సదుపాయం ఏర్పాటు చేస్తాం.

ఇప్పటికే దీపం పథకం ద్వారా నెల రోజుల్లోనే 82 లక్షల మందికి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందజేశాము. క్షేత్ర స్థాయి పర్యటనలో రోడ్ల మీద ఆరబెట్టిన ధాన్యాన్ని సాయంత్రం 5 గంటలలోపు కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేశాం. ఎక్కడా సమస్యలు రాకుండా చూసుకుంటాం. ఎవరూ అధైర్యపడవద్దు" అన్నారు.

Next Story