ఆత్మకూరులో కోవిడ్ కేర్ సెంటర్, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వసతులను మంగ‌ళ‌వారం పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రత్యక్షంగా పరిశీలించారు. కోవిడ్- 19 సోకిన రోగులకు అందుతున్న చికిత్స గురించి వైద్యుల‌ను అడిగి తెలుసుకున్న మంత్రి మేకపాటి.. సోను సూద్ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న ఆక్సిజన్ ప్లాంట్ స్థలాన్ని పర్యవేక్షించారు. అలాగే.. ఆత్మకూర్ టిడ్కో కేర్ సెంటర్ లో భోజనం సహా ఇతర సదుపాయాలపై అక్కడి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఏరియా ఆసుపత్రి మొత్తం కలియతిరుగుతూ ప్రత్యక్షంగా అక్కడి సదుపాయాలను పర్యవేక్షించారు.

రోగులకు ఎలాంటి అసౌకర్యం కలిగినా, ఏ విధమైన ఇబ్బంది వచ్చినా అందుబాటులో ఉన్న అధికారులను సంప్రదించాలని మంత్రి గౌతమ్ రెడ్డి తెలిపారు. అత్యవసర విభాగం సహా ఆక్సిజన్, వెంటిలేటర్ విభాగం, వ్యాక్సిన్ ప్రక్రియ నిర్వహించే ప్రాంగణాలను పరిశీలించారు. ఆస్పత్రిలో కరోనా చికిత్స పొందుతున్న వారిని పలకరించిన మంత్రి.. ఆసుపత్రిలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న బెడ్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఇటీవల విశాఖపట్నం ద్వారా ఆత్మకూరు ఏరియా ఆసుపత్రికి అందిన ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లని పరిశీలించి, వాటి పనితీరును పర్యవేక్షించారు. ప్రస్తుతం కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయని అధికారులు, వైద్యులు, ప్రజలు ఇదే పద్ధతిలో మరింత చొరవ తీసుకుని శ్రమిస్తే కరోనాని నియంత్రించగలమని మంత్రి అన్నారు. కోవిడ్ కి సంబంధించి మరిన్ని సౌకర్యాల ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలను జాయింట్ కలెక్టర్, ఆర్డిఓ, మున్సిపల్ కమిషనర్ ల ద్వారా మంత్రి తీసుకున్నారు.


సామ్రాట్

Next Story