ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీకి బలం అంతంతమాత్రమే.. ఉన్న 11 మందిలో కూడా కొందరు పార్టీకి దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని టీడీపీ నేతలు చాలా రోజులుగా చెబుతున్నారు. తాజాగా ఏపీ రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి టీడీపీ తలుపులు తెరిస్తే వైసీపీ ఎమ్మెల్యేలందరూ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీలో కొనసాగితే ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొవడం తప్పదని ఎమ్మెల్యేలు ఈ నిర్ణయానికి వచ్చారన్నారు. పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌తో టచ్‌లో ఉన్నారని తెలిపారు.
జమిలి ఎన్నికలకు ఎన్‌డీఏ కూటమి భయపడటం లేదన్నారు. ఒకవేళ ఎన్నికలు త్వరగా వచ్చినా వైసీపీ నుంచి పోటీ చేసే అభ్యర్థులే ఉండరని చురకలంటించారు. వైసీపీ అధినేత జగన్ బీఫాంలు ఇస్తామని బతిమాలినా కూడా ఎవరూ తీసుకోవడానికి ముందుకురారన్నారు.