ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలుపై మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు
అపార్ ఐడీ ద్వారా కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థుల పురోగతిని ట్రాక్ చేయాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు.
By అంజి Published on 2 March 2025 6:57 AM IST
ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలుపై మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు
అమరావతి: అపార్ ఐడీ ద్వారా కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థుల పురోగతిని ట్రాక్ చేయాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలో ఓ మోడల్ స్కూల్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలుకు విధివిధానాలు రూపొందించాలని, అమరావతిలో ఏఐ, స్పోర్ట్స్ వర్సిటీల పనులను వేగవంతం చేయాలని సూచించారు. వెల్ఫేర్ హాస్టళ్లలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు.
ఎపి మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో భాగంగా లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (లీప్) ప్రోగ్రామ్ అమలుకు చేపట్టాల్సిన చర్యలు, ప్రణాళికలపై పాఠశాలవిద్య, ఇంటర్మీడియట్, ఉన్నత విద్య శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించానని మంత్రి లోకేష్ తెలిపారు. ఎపి మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్, జిఓ 117కు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఈనెల 3వతేదీన శాసనసభ్యులతో వర్క్ షాపు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఉన్నత విద్యలో మార్పులు, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ మెరుగుదల తదితర అంశాలపై చర్చించేందుకు గవర్నర్ నేతృత్వాన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లతో త్వరలో సమావేశం ఏర్పాటు చెయ్యాలని మంత్రి లోకేష్ ఆదేశించారు.
పిజి ఫీజు రీఎంబర్స్ మెంట్ పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని, అమరావతిలో ఎఐ వర్సిటీ, స్పోర్ట్స్ వర్సిటీ పనులను వేగవంతం చెయ్యాలని చెప్పానన్నారు. దేశంలోనే అత్యుత్తమ ప్రమాణాలతో రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక మోడల్ స్కూల్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించాను. ఈ సమావేశంలో పాఠశాల విద్య కార్యదర్శి కోన శశిధర్, డైరక్టర్ విజయరామరాజు, ఇంటర్మీడియట్ విద్య డైరక్టర్ కృతికా శుక్లా, సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరక్టర్ బి.శ్రీనివాసరావు, ఉన్నత విద్యామండలి చైర్మన్ కె.మధుమూర్తి, కాలేజి ఎడ్యుకేషన్ డైరక్టర్ నారాయణ భరత్ గుప్తా, స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎండి గణేష్ కుమార్, కెపిఎంజి ప్రతినిధులు నారాయణన్ రామస్వామి, సౌమ్య వేలాయుధం, వి.మాధవన్ తదితరులు పాల్గొన్నారు.
అపార్ ఐడీ
కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థుల అకడమిక్ సమాచారాన్ని నిక్షిప్తం చేసేందుకు కేంద్రం అపార్‌ను తీసుకొచ్చింది. ఈ కార్డుల్లో విద్యార్థి పేరు, బర్త్ డే, ఫొటో, క్యూఆర్‌కోడ్, 12 అంకెలతో గుర్తింపు నంబర్ ఉంటుంది. స్టూడెంట్ హిస్టరీ మొత్తం ఇందులో ఉండటం వల్ల దేశంలో ఎక్కడ చదవడానికైనా ఇబ్బంది ఉండదు. ఆధార్ తరహాలో ఈ కార్డు శాశ్వతంగా ఉంటుంది. అందుకే పొరపాట్లు లేకుండా నమోదు చేయాలని కేంద్రం ఆదేశించింది.