పేదల ఇళ్ల నిర్మాణాల్లో కోట్లు దోచుకున్న ఏ ఒక్కరిని వదిలిపెట్టం

గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన పేదల ఇళ్ల నిర్మాణాల్లో కోట్లాది రూపాయలు దోచుకున్న ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు.

By Medi Samrat
Published on : 4 April 2025 6:19 PM IST

పేదల ఇళ్ల నిర్మాణాల్లో కోట్లు దోచుకున్న ఏ ఒక్కరిని వదిలిపెట్టం

గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన పేదల ఇళ్ల నిర్మాణాల్లో కోట్లాది రూపాయలు దోచుకున్న ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. శుక్రవారం సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డితో కలిసి తోటపల్లి గూడూరు మండలం వరిగొండలో, పొదలకూరు సమీపంలోని చిట్టేపల్లి తిప్ప వద్ద హౌసింగ్‌ లేఅవుట్లను మంత్రి పార్థసారథి, గృహనిర్మాణశాఖ ఎండి రాజబాబు పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి లబ్ధిదారులతో ముఖాముఖిగా మాట్లాడి పలు సమస్యలను తెలుసుకున్నారు.

ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి తాము నష్టపోయామని, తమ అకౌంట్లో పడిన డబ్బులను కూడా సంతకాలు పెట్టించుకుని తీసుకున్నారని... పనిచేయకుండానే బిల్లులు పెట్టి డబ్బులు కాజేశారని, ల్యాండ్‌ లెవెలింగ్‌ పేరుతో కోట్ల రూపాయలు కాజేశారని, స్టీలు, సిమెంటు, కిటికీలు, తలుపులు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారని, తమకు ఇల్లు కట్టించకుండా అన్నివిధాలుగా మోసం చేశారని మంత్రి ఎదుట పలువురు లబ్ధిదారులు తమ గోడు వెళ్లబోసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం పేదల ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి గృహ నిర్మాణ పథకాన్ని అభాసుపాలు చేసిందన్నారు. నెల్లూరు జిల్లాలో మంత్రులు, స్థానిక శాసనసభ్యుల ఫిర్యాదుల మేరకు గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్ల నిర్మాణాలపై విజిలెన్స్‌ ఎంక్వయిరీ వేసాం... ఈ ఎంక్వయిరీ లో 120 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు గుర్తించినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. పేదల ఇళ్ల నిర్మాణాల్లో కోట్లాది రూపాయల దోచుకున్న ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఇళ్ల నిర్మాణాలను నాసిరకంగా నిర్మించి, నిరుపేదలు, అమాయకులైన గిరిజనులను మోసం చేసి దోచుకున్న కాంట్రాక్టర్లు, గత ప్రభుత్వ నాయకులపై క్రిమినల్‌ కేసులు పెట్టి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటికే చాలామంది కాంట్రాక్టర్లపై కోర్టుల్లో కేసులు వేసామని చెప్పారు. రెవిన్యూ రికవరి యాక్ట్‌ ప్రకారం దోచుకున్న డబ్బును తిరిగి రికవరీ చేసి, పేదలకు నాణ్యత గల ఇల్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రూ 2.50 లక్షలు పేదల ఇళ్లకు మంజూరు చేసి పెద్ద ఎత్తున ఎన్టీఆర్‌ గృహనిర్మాలను నిర్మించినట్లు చెప్పారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 1.80 లక్షల నిధులను మాత్రమే ఖర్చు చేసి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని చెప్పారు. హౌసింగ్‌ పథకాన్ని ఒక దోపిడీ పథకంగా మార్చేశారని, పేదల కడుపు కొట్టారని మంత్రి పార్థసారథి మండిపడ్డారు. గత ప్రభుత్వ అవినీతిలో హౌసింగ్‌ అధికారుల పాత్ర కూడా ఉందని, వారిపై కూడా విచారించి కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. ఒక ఇంజనీరింగ్‌ ఏజెన్సీ ద్వారా అన్ని లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణాల నాణ్యత ప్రమాణాలను అంచనా వేయించి, ఆ సంస్థ నివేదిక మేరకు నాణ్యత గల నిర్మాణాలు ఉంటే కొనసాగిస్తామని, లేకుంటే బేస్మెంట్లను పగలగొట్టి మళ్లీ నాణ్యత ప్రమాణాలతో పేదలకు ఇళ్ళను నిర్మించి ఇస్తామని చెప్పారు. గత ప్రభుత్వ నాయకులు నిరుపేదలైన అమాయకులను దోచుకోవడం చాలా దారుణమని దౌర్భాగ్యమని, ఇంతకంటే నీచమైనది ఏదీ లేదన్నారు. అక్రమాలకు పాల్పడిన కాంట్రాక్టర్లు స్వచ్ఛందంగా తమ తప్పులను ఒప్పుకుని నాణ్యతగా ఇళ్లను నిర్మించేందుకు ముందుకు వస్తే మంచిదని, లేకుంటే వారి ఆస్తుల నుంచైనా రికవరీ చేసి నిరుపేదల ఇల్లు పూర్తి చేస్తామని చెప్పారు. పేదల ఇళ్ల నిర్మాణాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని, ఇప్పటికే ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేందుకు ఎస్సీలు, బీసీలకు 50,000, ఎస్టిలకు 75000 అదనపు సహాయాన్ని మంజూరు చేస్తున్నామని మంత్రి చెప్పారు. ఈ ఐదేళ్ల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల ఇళ్ల నిర్మాణాలు అర్హత ఉన్న పేదలందరికీ నిర్మించి ఇవ్వాలన్నదే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా మంత్రి పేర్కొన్నారు. ఈ మార్చి నుంచి నూతన ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 1.50 లక్షల రూపాయలకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయలు మొత్తం రూ. 2.50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఇళ్ల నిర్మాణాలకు ఇసుకను ఉచితంగా అందజేస్తామని చెప్పారు. డ్వాక్రా మహిళా సంఘాలకు అదనంగా రుణ సౌకర్యం కూడా కల్పిస్తామని చెప్పారు. అలాగే పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు చొప్పున పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని చెప్పారు. ఇప్పటికే పెద్దఎత్తున సామాజిక పింఛన్లు, అన్నక్యాంటీన్‌ ద్వారా పేదలకు ఆహారం, ఉచిత గ్యాస్‌ సిలిండర్లు వంటి సూపర్‌ సిక్స్‌ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్న మంత్రి, మే, జూన్‌ నెలల్లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను అమలు చేయనున్నట్లు చెప్పారు. సూపర్‌ సిక్స్‌ పథకాలతో పాటు మన బిడ్డల భవిష్యత్‌ గురించి ఆలోచన చేస్తూ చదువున్న ప్రతిఒక్కరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు.

Next Story