అందుకే మళ్ళీ ఎన్టీఆర్ భజన చేస్తున్నారు : మంత్రి కొడాలి నాని
Minister Kodali Nani Fires On TDP Leaders. రాష్ట్ర ప్రజల చేత అన్న అనిపించుకున్న వ్యక్తి ఎన్టీఆర్ అని మంత్రి కొడాలి నాని అన్నారు.
By Medi Samrat Published on 29 March 2022 7:34 PM ISTరాష్ట్ర ప్రజల చేత అన్న అనిపించుకున్న వ్యక్తి ఎన్టీఆర్ అని మంత్రి కొడాలి నాని అన్నారు. ఆయన పార్టీ స్థాపించి 40 ఏళ్లు అయ్యాయని.. ఇవాళ ఎన్టీఆర్ బొమ్మలు, ఫోటోలు పెట్టుకుని మరోసారి ప్రజలను మోసం చేయాలని.. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన 420 వెన్నుపోటు బ్యాచ్ ఈరోజు హడావుడి చేస్తుందని విమర్శించారు. నాడు ఎన్టీఆర్ ను చెప్పులతో కొట్టించి.. ఆయన పార్టీని లాక్కుని.. ఆయన్ను పార్టీలో నుంచి సస్పెండ్ చేసి, ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పదవిని లాక్కుని, ఆయన చావుకు కారణం అయ్యారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వెన్నుపోటు బ్యాచ్ రెండు, మూడు రోజుల నుంచి ఎన్టీఆర్ ఫోటోలు, విగ్రహాలు, ఎన్టీఆర్ భజన కార్యక్రమాలను చూపిస్తూ పండగ చేస్తున్నారని విమర్శించారు.
వాస్తవానికి, వీళ్లకు ఎన్టీఆర్ మీద ఎలాంటి ప్రేమ లేదని.. ఆయన పెట్టిన పార్టీ మీద, ఆయన సీఎం కుర్చిపైనే వీరి ప్రేమ అని ఆరోపించారు. పదవిని, పార్టీని అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని లూటీ చేసుకోవచ్చు. రాష్ట్రాన్ని మింగేయవచ్చనే ఆలోచనతో నాడు వ్యవహారాలు నడిపారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు డిఫాల్టర్ నాయకుడు అయిపోయాడని.. బాబు బొమ్మ పెట్టినా, బాబు పేరు పెట్టినా ప్రజలు అసహ్యించుకునే పరిస్థితిలో ఉన్నారని అన్నారు. టీడీపీకి చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ దరిద్రంలాగా పట్టి పీడిస్తున్నారని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలే భావిస్తున్నారని నాని అన్నారు.
చంద్రబాబు, లోకేష్ పేర్లు చెబితే నాలుగు ఓట్లు కూడా రావని.. మళ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చెత్త చెత్తగా ఓడిపోతుందని.. కాబట్టి ఈ పార్టీని కాపాడుకోవాలంటే ఒకటే మార్గం.. మళ్లీ ఎన్టీఆర్ పేరు చెప్పుకుని మోసం చేయాలనే ఈ డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. అందుకే, ఎన్టీఆర్ చావుకు కారణం అయిన ఈ గుంటనక్కలు మళ్లీ ఎన్టీఆర్ బొమ్మలు, ఫోటోలతో భజన చేసే కార్యక్రమాలు పెట్టుకున్నారని కొడాలి నాని విమర్శించారు.