మిచౌంగ్ తుపాను నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం జగన్ ఆదేశాలతో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నిరకాల చర్యలు చేపట్టామని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. తేమ ఉన్నా, రంగు మారిన ధాన్యం అనే తేడా లేకుండా ఎక్కడికక్కడ కొనుగోలు చేస్తున్నామన్నారు. మిచౌంగ్ తుపాను బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని, ఎవరూ అధైర్యపడొద్దని మంత్రి భరోసా ఇచ్చాడు. మంగళవారం తణుకు నియోజకవర్గంలోని దువ్వ, వరిగేడు గ్రామాల్లో పర్యటించిన మంత్రి కారుమూరి వరి చేలను పరిశీలించారు. వీలైనంత త్వరగా రైతులు తమ ధాన్యాన్ని అందుబాటులో ఉన్న మిల్లులకు తరలించాలని సూచించారు. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ రెండు విధాలుగానూ ధాన్యాన్ని తరలించే అవకాశం కల్పించామని మంత్రి తెలిపారు. ఏ మిల్లర్లు అయినా రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
పంట నష్టం జరిగిన ప్రాంతాలను పరిశీలించిన మంత్రి పినిపే విశ్వరూప్. భగవంతుడి దయవల్ల కోనసీమపై మిచౌంగ్ ప్రభావం పెద్దగా లేదన్నారు. ఇప్పటికే లక్షా ఆరు వేల ఎకరాల్లో పంట కోతలు పూర్తయ్యాయని తెలిపారు. ఇంకా 51 వేల ఎకరాల్లో మాత్రమే కోతలు కోయాల్సి ఉందని.. తొమ్మిది వేల ఎకరాలపై తుఫాన్ ప్రభావం ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా వేశామని తెలిపారు. తడిచిన ధాన్యాన్ని, రంగు మారిన ధాన్యాన్ని, మొలకెత్తిన ధాన్యాన్ని సైతం కచ్చితంగా కొనుగోలు చేస్తామని తెలిపారు.