బాబు పోరాటం స్టేట్ ప్రయోజనాల కోసం కాదు.. రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసమే..
Minister Kannababu Fires On Chandrababu. చంద్రబాబు కలలుగన్నట్టుగా తాను.. తన చుట్టూ ఉండే తన బినామీల సొంత సంపద సృష్టికి
By Medi Samrat Published on 8 Aug 2021 6:39 PM ISTచంద్రబాబు కలలుగన్నట్టుగా తాను.. తన చుట్టూ ఉండే తన బినామీల సొంత సంపద సృష్టికి విఘాతం కలుగుతుందనే బాధతోనే అమరావతి ఉద్యమం పేరుతో ఉత్సవాలు జరుపుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. చంద్రబాబు పోరాటం స్టేట్ ప్రయోజనాల కోసం కానేకాదని.. తన రియల్ ఎస్టేట్ వ్యాపార ప్రయోజనాల కోసమేనని అన్నారు. అమరావతి ఉద్యమం పేరుతో ఆ ప్రాంత ప్రజలను భ్రమల్లో ఉంచి.. 600 రోజుల పేరుతో టీడీపీ పండగ చేసుకుంటుందని, ఇకనైనా ఆ భ్రమల్లో నుంచి చంద్రబాబు బయటకు రావాలని హితవు పలికారు. అమరావతి ఆందోళనాకారులపై ఏదో జరిగిపోతుందంటూ ఉదయం నుంచి టీడీపీ, వారికి వత్తాసు పలికే మీడియా గోరంతను కొండంత చేసి చూపించే ప్రయత్నం చేస్తుందని, టీడీపీ హయాంలో జరిగినట్టుగా ఈ ప్రభుత్వం ఏ ఒక్కరి మీద దమనకాండ చేయదని మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు.
ప్రజల హృదయాల్లో నుంచి, ఉద్వేగం నుంచి పుడితే వాటిని ఉద్యమాలు అంటారుకానీ, స్వప్రయోజనాల కోసం, స్వార్థం కోసం, కొంతమంది వ్యక్తుల భవిష్యత్తు కోసం మాట్లాడే మాటల్ని, చేసే చేతలను ఉద్యమాలు అనరు, వాటిని డ్రామాలు అంటారని మంత్రి కన్నబాబు వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అమరావతి ఉద్యమాన్ని తానే పెంచి పోషిస్తున్నాను అనుకుంటూ ఓ కృత్రిమ ఉద్యమాన్ని ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ప్రజల మనోభావాలను అర్ధం చేసుకోకుండా కేవలం "నా స్వార్థం.. నా ప్రయోజనాలే ముఖ్యం" అన్నట్లు చంద్రబాబు ప్రవర్తిస్తున్నారన్నారు.
అమరావతి రాజధాని ప్రాంతంలో మంగళగిరిలో లోకేష్ ను ఓడించినా, ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీల నుంచి గుంటూరు, విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల వరకు అన్ని ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం చవిచూసినా చంద్రబాబు మైండ్ సెట్ మార్చుకోలేదని అన్నారు. గుంటూరు మున్సిపల్ ఎన్నికల్లో చంద్రబాబు ప్రజలను రెచ్చగొట్టారని, అయినా ప్రజలు తిరస్కరించారని గుర్తు చేశారు. చంద్రబాబు రెచ్చగొట్టినా ప్రజలు విజ్ఞతతో, అమరావతి రాజధాని ప్రాంతంలో కూడా వైఎస్సార్‌సీపీకి ఏకపక్షంగా మద్దతు పలికి గెలిపించారని, ఇది రెఫరెండం కాదా అని మంత్రి కన్నబాబు ప్రశ్నించారు. అధికారంలో ఉన్న ఐదేళ్ళూ అమరావతి రాజధాని పేరుతో కాగితాల మీద ఇడ్లీ పాత్రలు లాంటి గ్రాఫిక్స్ తో కాలయాపన చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఇదే అమరావతి ప్రాంతంలో వికేంద్రీకరణకు మద్దతుగా ఉద్యమం చేస్తున్న దళితులను అవమానించినందుకు చంద్రబాబు, టీడీపీ నేతలు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కన్నబాబు డిమాండ్ చేశారు.