చంద్రబాబుకు సవాల్ విసిరిన మంత్రి కాకాణి

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి బహిరంగ సవాల్‌ విసిరారు.

By Medi Samrat  Published on  7 Feb 2024 8:00 PM IST
చంద్రబాబుకు సవాల్ విసిరిన మంత్రి కాకాణి

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి బహిరంగ సవాల్‌ విసిరారు. చంద్రబాబు తనపై ఉన్న కేసుల్లో ఒక్క దానికైనా సీబీఐ విచారణకు సిద్ధమని ప్రకటించగలరా? అని సవాల్ విసిరారు. ఈ అంశంపై 24 గంటల్లో స్పందించాలని చంద్రబాబుకు టైమ్ ఇచ్చారు. కోర్టు కేసుకు సంబంధించిన డాక్యుమెంట్ ల చోరీ కేసులో సీబీఐ నాకు క్లీన్ చిట్ ఇచ్చిందని గుర్తు చేశారు. సీబీఐ విచారణకు సిద్ధమని ఏపీ హైకోర్టుకు కూడా నేను తెలియచేశానన్నారు. అసలు గోవర్ధన్ రెడ్డి ప్రమేయం లేదని సీబీఐ తన చార్జిషీట్ లో స్పష్టంగా చెప్పిందన్నారు. టీడీపీ చేసిన ఆరోపణలు వాస్తవం కాదని సీబీఐ చెప్పిందన్నారు. వైఎస్‌ అవినాష్ రెడ్డి కేసులో సీబీఐ అత్యున్నత స్థాయి దర్యాప్తు సంస్థ అయినప్పుడు నా కేసులో అది ఉన్నత దర్యాప్తు సంస్థ ఎందుకు కాకుండా పోయిందని ప్రశ్నించారు కాకాణి గోవర్ధన్‌రెడ్డి.

సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మరోసారి అధికారం చేపట్టబోతోందని అన్నారు. వైసీపీ ఓడించలేక చంద్రబాబు పొత్తుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారని.. ఏదైనా కొత్త పార్టీ వస్తే కూడా చంద్రబాబు పొత్తు పెట్టుకుంటారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం విఫలం అయితే చంద్రబాబుకు ఇతర పార్టీలతో పొత్తుల అవసరం ఉండదని అన్నారు.

Next Story