ఆ వీడియో లోకేష్ ప్రొడక్షన్.. దానికి చంద్రబాబు ప్రొడ్యూసర్

Minister Jogi Ramesh Fire On TDP. తెలుగుదేశం పార్టీ ఒక శాడిస్టు సైకాలజీ ప్రదర్శిస్తోందని మంత్రి జోగి రమేష్ మండిప‌డ్డారు.

By Medi Samrat  Published on  9 Aug 2022 9:30 PM IST
ఆ వీడియో లోకేష్ ప్రొడక్షన్.. దానికి చంద్రబాబు ప్రొడ్యూసర్

తెలుగుదేశం పార్టీ ఒక శాడిస్టు సైకాలజీ ప్రదర్శిస్తోందని మంత్రి జోగి రమేష్ మండిప‌డ్డారు. ఇది ఈరోజు వారు పెట్టిన ఆల్ పార్టీ మీటింగ్ అంటూ.. చేసిన ఒక వికృత మీటింగ్‌లో మరింతగా బయటపడిందని విమ‌ర్శించారు. పెడన, ఒంగోలులో మంత్రి జోగి రమేష్, పార్టీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్బంగా టీడీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. మహిళలకు సంబంధించి ఏపీలో ఎటువంటి సమస్యా లేదని.. ఉన్న సమస్యంతా చంద్రబాబు, లోకేశ్‌తోనే.. వారు పెట్టుకున్న మీడియా, సోషల్ మీడియాతోనేన‌ని అన్నారు. ఎక్కడో ఓ వీడియో వారే సృష్టించి.. ఆ వెంటనే న్యూడిటీ అంటూ వారే గగ్గోలు పెట్టి.. ఆ తర్వాత వారే డిబేట్స్ కండెక్ట్ చేసి.. వారే ప్రెస్‌మీట్లు పెట్టించి.. ఆ తర్వాత వారే ఏకంగా రౌండ్ టేబుల్ పెట్టారు.. సిగ్గులేకపోతే సరి.. ఇటువంటివి చేయటానికి అని నిప్పులు చెరిగారు.

అసలు ఒక అత్యాచారం కానీ, అరాచకం కానీ, మహిళలను కించపరిచే విధంగా ఒకరి ప్రవర్తన కానీ ఉంటే బాధితురాలు బయటకు వచ్చి చెప్పుకోవాలి. కానీ, టీడీపీ చేస్తున్న పనుల వల్ల మహిళలు బాధితులుగా మారుతున్నారని అన్నారు. బాధిత మహిళలకు ఏరోజూ టీడీపీ అండగా నిలబడ లేద‌ని అన్నారు. ఏ బాధిత మహిళా వచ్చి.. తాను ఈ వ్యవహారంలో బాధితురాలుగా ఉన్నానని టీడీపీకి చెప్పిందో వారే వెల్లడించాలని సూచించారు.

అసలు గోరంట్ల మాధవ్‌ది అంటున్న వీడియో లోకేశ్‌ ప్రొడక్షన్స్‌ నుంచి వస్తే.. దాని నిర్మాత చంద్రబాబు. డైరెక్షన్‌ అయ్యన్నపాత్రుడు అని ఆరోపించారు. ఇందులో బాధిత మహిళ ఎవరో ఎవరికీ తెలియదు. వీడియో ఎక్కడ నుంచి వచ్చిందో తెలియదు. అదొక థర్డ్‌ పార్టీ రికార్డింగ్‌.. అంటే దీని అర్థమేమిటి? ఇది ఒరిజినల్ వీడియో అయితే బాధిత మహిళ చెప్పాలి కదా.! బాధిత మహిళకు రక్షణ లేదంటే ఆ రక్షణ మేం ఇస్తాం. అటువంటి వీడియోను సమాజం మీదకు వదలటం.. సిగ్గు, బుద్ధి, బాధ్యత ఉన్న ఏ పొలిటికల్ పార్టీ కానీ.. ఏ సోషల్‌ మీడియా చేస్తుంది..? అని ప్ర‌శ్నించారు.

సిగ్గున్న ఏ మీడియా అయినా ఇటువంటి వీడియోలను సమాజం మీదకు వదులుతుందా? నిజాలు ఇలా ఉంటే.. మరి టీడీపీ, చంద్రబాబు దీన్ని ఎందుకు పండుగ చేసుకుంటున్నారు. ఎందుకు పండుగ చేసుకుంటున్నారంటే.. దానికి కారణం దీనికి నిర్మాతలు, దర్శకులూ అంతా వారే అని అన్నారు.

నిజానికి ఈ న్యూడిటీకి ఇలాంటి వీడియోల ప్రదర్శనకి, వీటిని సమాజం మీద వదలటానికి సంబంధించి ఒకవేళ తప్పు ఎంపీది అయితే.. ఆ తప్పు చేసిన వారిని కచ్చితంగా శిక్షించాలని ఇప్పటికే సీఎం ఆదేశించటం జరిగింది. పోలీసు డిపార్ట్‌మెంట్ దర్యాప్తు చేస్తోంది. కానీ.. దురదృష్టం ఏమిటి అంటే ఇప్పటివరకు బాధిత మహిళ ఎవరో తెలియదు. వీడియో మాత్రం ఏకంగా టీడీపీ మెయిన్ స్ట్రీమ్‌ మీడియాలోనే, టీవీల్లోనే వేసేశారు. అంటే దీనర్థం ఏమిటి? దీనికి బాధ్యులెవరు. ఎవరి మీద చర్య తీసుకోవాలి. ఎవరి నగ్నత్వం బయటపడింది. ఇది టీడీపీ న్యూడిటీ కాదా? ఇది చంద్రబాబు, లోకేశ్‌ల విశృంఖుల ప్రవర్తనకు నిదర్శనం కాదా? ఇది పక్కాగా డిజైన్ చేసి వదిలిన వీడియో కాదా? అని ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు.

నిజంగా చంద్రబాబుకు సిగ్గుంటే తన హయాంలో జరిగిన కాల్‌మనీ వ్యవహారానికి.. వందల మంది మీద కాల్‌మనీ అత్యాచారాలకు బాధ్యత వహించి, ఏ నూతిలో అయినా దూకేవాడు. అటువంటిది ఏదీలేకుండా ఈ సిగ్గుమాలిన మూకనంతా రంగంలో దింపి.. మహిళాపక్షపాత ప్రభుత్వం మీద అవాకులు చెవాకులు మాట్లాడిస్తున్నారు. మా సంక్షేమ పథకాల్లో ఒక అమ్మ ఒడి, ఒక ఆసరా, ఒక చేయూత వంటి పథకాలు మహిళలకు ఇస్తున్న ప్రభుత్వం మీద సంక్షేమం, అభివృద్ధిలో పోటీపడలేకే ఈ సిగ్గులేని వ్యవహారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

మాధవ్ వీడియోల్లో అశ్లీలం ఉంటే మాధవ్ మీద చర్యలు తీసుకుంటాం. కానీ ఇదొక కుట్రపూరితం అయితే ఇదొక ట్యాంపర్డ్ వీడియో అయితే ఇదొక రాజకీయ కుట్రలో భాగమైతే కచ్చితంగా అందుకు బాధ్యులైన వారి మీద కూడా చర్యలు తీసుకుంటాం అని హెచ్చ‌రించారు.


Next Story