అమర్ రాజా సంస్థ వచ్చే పదేళ్లలో తెలంగాణలో 9500 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో అమర్ రాజా లిథియం అయాన్ గిగా ఫ్యాక్టరీ ఏర్పాటు కానుంది. ఎంపీ గల్లా జయదేవ్ తమ కుటుంబానికి చెందిన అమరరాజా గ్రూప్ తెలంగాణలో యూనిట్ ఏర్పాటు చేస్తున్నందుకు సంతోషిస్తున్నామని అన్నారు. నూతన టెక్నాలజీతో ఈవీ బ్యాటరీల తయారీ యూనిట్ ను నెలకొల్పుతున్నామని అన్నారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ.. అమరరాజా గ్రూప్ తెలంగాణలో రూ.9,500 కోట్ల పెట్టుబడులు పెడుతోందని తెలిపారు. అమరరాజా సంస్థను వైసీపీ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసిందని చంద్రబాబు ఆరోపించారు. అమరరాజాను గత ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే, ఈ సీఎం వేధించారని.. ఏపీ వ్యక్తి మరో రాష్ట్రంలో పెట్టుబడి పెట్టే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. టీడీపీ నాయకులు కూడా ఈ విషయంపై వైసీపీ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు.
ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని.. అమరరాజా ప్రతినిధులు ఇతర ప్రాంతాల్లో పెట్టుబడులు పెడితే ఇక్కడి నుంచి వెళ్లిపోయినట్లా అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ఏదో రకంగా బద్నాం చేయాలిని ప్రయత్నిస్తున్నారని అన్నారు. చంద్రబాబు కోసం ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని.. ఎల్లోమీడియా ఎన్ని జాకీలు పెట్టినా చంద్రబాబు లేవలేరన్నారు. చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ వ్యాపారం ఏపీలో ఉంది. ఆయనను ఈ మూడున్నరేళ్లలో ప్రభుత్వం ఏనాడైనా ఇబ్బంది పెట్టిందా?. పారిశ్రామిక వేత్తలకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు.