స్వగ్రామం నుంచే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం : మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

Minister Gowtham Reddy About Work In Home Town Center. రాష్ట్రంలో "వర్క్ ఇన్ హోమ్ టౌన్ సెంటర్ల" ఏర్పాటు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

By Medi Samrat  Published on  3 Sept 2021 10:04 PM IST
స్వగ్రామం నుంచే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం : మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

రాష్ట్రంలో "వర్క్ ఇన్ హోమ్ టౌన్ సెంటర్ల" ఏర్పాటు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 10 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారు. వారికి స్వగ్రామంలో పనిచేసుకునే విధంగా అన్ని ఏర్పాటు చేసి ఎక్కువ మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులను స్వగ్రామాలలో కన్నవారితో ఉంటూ ఉద్యోగం చేసుకునేలా వర్క్ ఇన్ హోమ్ టౌన్ల కు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంది. వర్క్ ఇన్ హోమ్ టౌన్ సెంటర్ల ఏర్పాటుకు కావలసినసిన సదుపాయాలు, అవసరాలు, నమూనా రూపకల్పన కోసం ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఐటీ, నైపుణ్య, శిక్షణ ఫైబర్ నెట్ ఉన్నతాధికారులతో 'టాస్క్ ఫోర్స్ కమిటీని' ఏర్పాటు చేశారు.

శుక్రవారం మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఐటీ, నైపుణ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అధ్యక్షతన ప్రభుత్వ సలహాదారు సజ్జల, ఏలూరు ఎంపీ శ్రీధర్ సమక్షంలో సమావేశం జరిగింది. ఎక్కడెక్కడో పని చేస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగులు.. సొంత ఊళ్లలోనే నిశ్చింతగా పని చేసుకునే విధంగా చేపట్టాల్సిన చర్యలను ప్రభుత్వం ప్రారంభించిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. సెప్టెంబర్ మూడోవారంలోగా బిజినెస్ సెంటర్ల ఏర్పాటులో కీలకమైన మోడళ్లను తయారు చేయాలని టాస్క్ ఫోర్స్ కమిటీని మంత్రి గౌతమ్ రెడ్డి ఆదేశించారు.

ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ హేమ చంద్ర, ఏపీఎస్ఎస్డీసీ ఎండీ బంగారు రాజు, ఏపీటీఎస్ ఎండీ నందకిశోర్, ఐ.టీ శాఖ సలహాదారులు విద్యాసాగర్ రెడ్డి, దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి, ఏపీ ఫైబర్ నెట్ ఎండీ మధుసూదన్ రెడ్డి తదితర 6 మంది ఉన్నతాధికారులతో టాస్క్ ఫోర్స్ లతో కూడిన సభ్యులను టాస్క్ ఫోర్స్ కమిటీగా ఏర్పాటు చేశారు. సాధ్యమైనంత వేగంగా వర్క్ ఇన్ హోమ్ టౌన్ సెంటర్లను ఏర్పాటు చేయడానికి అందుబాటులో ఉన్న వనరులను పరిశీలించాలని, అందుకు అవసరమైన ఇంటర్ నెట్, విద్యుత్ వంటి మౌలిక వసతుల వ్యయాల అంచనాలను రూపొందించాలన్నారు.

ఇంజనీరింగ్ కాలేజీలలోని ఐటీ ల్యాబ్ ల జాబితా సహా సాప్ట్‌వేర్‌ ఉద్యోగం స్వగ్రామంలోనే చేసుకునే వీలుగా ఉండే ప్రాంతాలను చూసి అనుకూలమైనవాటిని పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించారు. వాటికి అవసరమైన ప్రోత్సహకాల విషయంపైనా సమీక్షించాలన్నారు. వర్క్ ఇన్ హోమ్ టౌన్ సెంటర్ల నమూనా కోసం బెంగళూరు హైదరాబాద్ పెద్ద ప్రాంతాలలోని సదుపాయాలను పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి మేకపాటి పేర్కొన్నారు. ఇప్పటికే వర్క్ ఇన్ హోమ్ టౌన్ సెంటర్ల ఏర్పాటుకు కావలసిన సకల వసతులు ఉన్న 100 సెంటర్లు సిద్ధంగా ఉన్నట్లు నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ మంత్రి దృష్టికి తీసుకు వచ్చింది. వెంటనే వాటిని పరిగణలోకి తీసుకొనేందుకు మంత్రి ఆమోదం తెలిపారు.


Next Story