ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో మంత్రి ధర్మాన ప్రసాద రావు భేటీ అయ్యారు. పరిపాలన రాజధానిగా విశాఖ సాధన ఉద్యమం కోసం ఆయన రాజీనామాకు కూడా సిద్ధమయ్యారు.. విశాఖ రాజధాని ఉద్యమం చురుగ్గా, చైతన్యవంతంగా సాగేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు. ఉత్తరాంధ్ర ప్రజల అభిలాషను నెరవేర్చడం కన్నా మంత్రి పదవి గొప్పది కాదని పేర్కొన్న ధర్మాన తన రాజీనామాను అనుమతించాలని సీఎం జగన్ ను కోరారు. అయితే మంత్రి ధర్మానను సీఎం జగన్ వారించినట్లు తెలుస్తోంది. అభివృద్ధిని అన్ని ప్రాంతాలకూ పంచుతూ, వికేంద్రీకరణ-సమగ్రాభివృద్ధే విధానమని స్పష్టం చేశారు. మూడు ప్రాంతాలకు సమన్యాయమే ప్రభుత్వ ధ్యేయమని ఆయనతో తెలిపారు.
కొద్దిరోజుల కిందట సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాద రావు మూడు రాజధానుల వ్యవహారంపై స్పందిస్తూ విశాఖ రాజధాని కోసం అవసరమైతే రాజీనామా చేస్తానని మంత్రి ధర్మాన ప్రకటించారు. ముఖ్యమంత్రి అనుమతిస్తే తన పదవికి రాజీనామా చేసి ఉద్యమంలోకి వచ్చేందుకు సిద్ధమని స్పష్టం చేసారు. రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటే వచ్చే నష్టం ఏంటని ప్రతిపక్షాలను ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన అనంతరం రాష్ట్రానికి రాజధాని వెతుక్కోవాల్సి వచ్చిందని ధర్మాన చెప్పుకొచ్చారు.