2022-23లో రూ.28,103 కోట్ల పన్ను వసూలు.. రాష్ట్ర చరిత్రలోనే ఇది అధికం : మంత్రి
Minister Buggana Rajendranath inaugurated the Regional GST Audit and Enforcement Office. సీఎం జగన్ ఆదేశాల మేరకు వాణిజ్య పన్నుల శాఖలో పలు సంస్కరణలు అమలు చేయడం
By Medi Samrat Published on 16 Jun 2023 3:24 PM ISTMinister Buggana Rajendranath inaugurated the Regional GST Audit and Enforcement Office
సీఎం జగన్ ఆదేశాల మేరకు వాణిజ్య పన్నుల శాఖలో పలు సంస్కరణలు అమలు చేయడం ద్వారా సత్ఫలితాలు వెలువడుతున్నాయని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. శుక్రవారం విజయవాడ బీసెంట్ రోడ్డు సమీపంలోని సెంట్రల్ గ్రావిటీ బిల్డింగ్ మూడవ అంతస్తులో వాణిజ్య పన్నుల శాఖకు చెందిన ప్రాంతీయ జీఎస్టీ కార్యాలయాన్ని (రీజినల్ జీఎస్టీ ఆడిట్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ ఆఫీస్) మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రారంభించారు.
అనంతరం మంత్రి బుగ్గన మాట్లాడుతూ.. వాణిజ్య పన్నుల శాఖలో పారదర్శకంగా నిర్ణయాలు అమలు కావాలనే ఉద్దేశంతో గతంలో ఎన్నడూ లేని విధంగా మొదటిసారి ఇన్వర్ట్ పిరమిడ్ తరహాలో సంస్కరణలు ప్రవేశపెట్టి పాలన విధానం అమలు చేస్తున్నామన్నారు. పన్నుదారుకి(ట్యాక్స్ పేయర్) లబ్ధి చేకూర్చేలా నిర్ణయాలు తీసుకున్నామన్నారు. గతంలో పన్నుల చెల్లింపు రిజిస్ట్రేషన్, ఎన్ ఫోర్స్ మెంట్, ఆడిట్ లాంటి ప్రక్రియలు ఒకే అధికారి చూడటం వల్ల పొరపాట్లు దొర్లేవని, సంస్కరణల ఫలితంగా ఆ విధానానికి చెక్ పెడుతూ ఆ ప్రక్రియలన్నీ వేరువేరుగా జరిగేలా చేస్తున్నామన్నారు. ప్రభుత్వ శాఖల విధులు, బాధ్యతల్లో పిరమిడ్ విధానం అనుసరించడం ద్వారా మెరుగైన పాలన చేస్తున్నామన్నారు. వ్యక్తుల పరంగా పొరపాట్లు జరగకూడదనే ఈ విధానం అమల్లోకి తెచ్చామని, అధికారులకు కూడా ఈ విభజించిన విధానంతో వెసులుబాటు కలుగుతుందన్నారు.
2022-23లో పన్ను ఆదాయం (కంపెన్సేషన్ లేకుండానే) రూ.28,103 కోట్ల వసూలు అయితే 2021-22లో రూ.23,386 కోట్లు వసూలు అయ్యాయన్నారు. గతేడాదితో పోలిస్తే 25 శాతం పెరుగుదల ఉందన్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఇది అధికమన్నారు. కేంద్ర జీఎస్టీ (సీజీఎస్టీ), రాష్ట్ర జీఎస్టీ (ఎస్ జీఎస్టీ) కి కేటాయించిన డీలర్ల పరంగా వచ్చిన పన్ను వసూళ్లను పరిశీలిస్తే కేంద్ర జీఎస్టీ ద్వారా వచ్చిన పన్ను ఆదాయం 21.36 శాతం ఉంటే రాష్ట్ర జీఎస్టీ ద్వారా వచ్చిన వసూళ్లు 25.23 శాతంగా ఉందన్నారు. అంటే కేంద్ర జీఎస్టీతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లో 4 శాతం మేర (మొత్తంగా 23 శాతం పెరుగుదల) అదనంగా పన్నువసూలు అయిందని మంత్రి గణాంకాలతో సహా వివరించారు. అదే మహారాష్ట్రలో పరిశీలిస్తే అక్కడ సెంట్రల్ జీఎస్టీ 23.6 శాతంగా ఉంటే స్టేట్ జీఎస్టీ 24.4 శాతంగా అంటే 1 శాతం పెరుగుదల ఉందన్నారు. కర్ణాటకలో పరిశీలిస్తే సెంట్రల్ జీఎస్టీ 28.5 శాతంగా ఉంటే స్టేట్ జీఎస్టీ 27.5 శాతంగా అంటే 1 శాతం సెంట్రల్ జీఎస్టీ కన్నా తక్కువగా ఉందన్నారు. దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లలో కర్ణాటక రాష్ట్రం మొదటిస్థానంలో, ఏపీ మూడో స్థానంలో ఉండగా సెంట్రల్ జీఎస్టీ కంటే స్టేట్ జీఎస్టీ వసూళ్ల విషయంలో 4 శాతంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉండటం గర్వించాల్సిన విషయమన్నారు.
రాష్ట్ర ఆదాయం, పన్నుల వసూళ్లు, పాలన విషయంలో కొందరు చేస్తున్న విమర్శలు అవాస్తవమన్నారు. నిజంగా మాకు పాలించడం రాకపోతే, అభివృద్ధి చేయకపోతే, రాష్ట్రం ప్రగతి పథంలో ముందుకు వెళ్లకుండా గడిచిన నాలుగేళ్లలో పన్ను వసూళ్లు ఎలా పెరిగాయని ప్రశ్నించారు. పెరిగిన వసూళ్లే తమ పాలనకు నిదర్శనమన్నారు. పరిపాలన, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్షంతో చర్చకు సిద్ధమన్నారు. ఆర్థిక అంశాలపై స్పష్టత ఉంటే చర్చకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు.
గతంలో కంటే మెరుగ్గా రహదారులపై రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతోందన్నారు. ఇదే విషయాన్ని అసెంబ్లీలో సైతం ఆధారాలతో సహా వివరించామన్నారు. రాష్ట్రంలో ఆర్ అండ్ బి రహదారులు చాలా మేర బాగున్నాయని, ఒకట్రెండు చోట్ల బాగోలేదని రాష్ట్రమంతటా అదే విధంగా ఉన్నాయని కొందరు దురుద్దేశపూర్వకంగా విమర్శలు చేస్తున్నారన్నారు. 4 రెట్లు అధికంగా రాష్ట్రానికి జాతీయ రహదారులు తీసుకొచ్చామన్నారు.
గతంలో కంటే పరిశ్రమల ఏర్పాటులో, పారిశ్రామికాభివృద్ధిలో ముందంజలోనే ఉన్నామన్నారు.ఏటా సగటున రూ.11,000 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో సైతం సంక్షేమాన్ని ఆపలేదన్నారు. ప్రతి నెలా ఠంఛన్ గా 1వ తేదీనే సామాజిక పింఛన్ లు అందించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. పరిపాలన,అభివృద్ధి విషయంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో, భక్తిభావంతో పని చేస్తుందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు.