నిశ్శబ్ధంగా అభివృద్ధి చేసుకుంటూ పోవడమే మా విధానం
Minister Buggana Rajendranath Fire On TDP. గడిచిన మూడేళ్ల కాలంలో రాష్ట్రం ప్రగతిలో ముందంజలో ఉందని కర్నూలు జిల్లా ఇంఛార్జ్ మంత్రి
By Medi Samrat Published on 7 Oct 2022 1:49 PM IST
గడిచిన మూడేళ్ల కాలంలో రాష్ట్రం ప్రగతిలో ముందంజలో ఉందని కర్నూలు జిల్లా ఇంఛార్జ్ మంత్రి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. ఓర్వకల్లు పారిశ్రామిక పార్కులో నీటి వసతి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి బుగ్గన మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు, వారి అనుకూల మీడియా ద్వారా అసత్య ప్రచారం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. అసత్య ప్రచారాలకు అసలు నిజమేంటో చూపే కార్యక్రమమే నేటి శంకుస్థాపన అని అన్నారు. ఎగుమతులలో 7వ స్థానం నుంచి 4వ స్థానానికి ఎగబాకిన ఏపీ.. వరుసగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో అగ్రస్థానం సాధిస్తోందని అన్నారు.
హైదరాబాద్- బెంగళూరు పారిశ్రామిక కారిడార్ ని మంజూరు చేయించిన ఘనత మన ప్రభుత్వానిదని అన్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చొరవ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలోని ప్రభుత్వ కృషికి నిదర్శనం అని అన్నారు. గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కలిసి పని చేసినా రాష్ట్ర ప్రయోజనాలకై ఏం చేసిందేంలేదని అన్నారు. విశాఖ, చిత్తూరు, నెల్లూరు, కడప, ప్రకాశం, కర్నూలు అన్ని ప్రాంతాల్లో పారిశ్రామికాభివృద్ధి జరుగుతున్నట్లు పేర్కొన్నారు.
అరటితోటల మధ్యలో పరిశ్రమలు, అద్దె షూట్ లతో పెట్టుబడులంటూ గత ప్రభుత్వ ప్రచారం అని అన్నారు. గత ప్రభుత్వానిది ఆర్భాటపు ప్రచారం. విమర్శలకు ధీటుగా నిశబ్దంగా అభివృద్ధి చేసుకుంటూ పోవడమే మా విధానం అని వివరించారు. ఉయ్యాలవాడ ఎయిర్ పోర్ట్ ఏమీ లేకుండానే ప్రారంభించారు. సోమవారం పోలవరం అని ప్రచారం.. వాస్తవానికి జరిగింది శూన్యం అని అన్నారు. సీఎం జగన్ నాయకత్వంలో అన్ని రంగాలలో ప్రగతి సాధించిందని అన్నారు. అనుకూల మీడియా, సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వంపై దుష్ప్రచారం జరుగుతుందని.. యువత, ప్రజలకు , అక్ష్యరాస్యులకు మీడియా ద్వారా తెలియవలసిన వాస్తవాలివని అన్నారు.