వారికి మంజూరైన పింఛన్లు మాత్రమే తొలగిస్తున్నారు : మంత్రి బొత్స

Minister Botsa Satyanarayana About Pensions. అర్హులైన వారందరికీ పింఛన్లు ఇవ్వాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యం అని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

By Medi Samrat  Published on  3 Jan 2023 9:42 AM GMT
వారికి మంజూరైన పింఛన్లు మాత్రమే తొలగిస్తున్నారు : మంత్రి బొత్స

అర్హులైన వారందరికీ పింఛన్లు ఇవ్వాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యం అని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గంట్యాడ మండలం కొటారుబిల్లి జంక్షన్ వద్ద వైఎస్ఆర్ పింఛన్ కానుక పథకంలో కొత్త ఫించన్ దారులకు పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. అర్హులైన వారి పింఛన్లు తొలగించే ప్రసక్తే లేదని.. పించన్లు తొలగిస్తున్నారని జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని అన్నారు. ధనవంతులు, అర్హతలు లేని వారికి మంజూరైన పింఛన్లు మాత్రమే తొలగిస్తున్నారని స్ప‌ష్టం చేశారు.

జిల్లాలో 4 వేల మంది పింఛన్ దారులకు నోటీసులు ఇస్తే.. వారిలో 2,790 మంది తమ అర్హతను నిరూపించారని.. 736 మంది తమ అర్హతను నిరూపించే ధృవపత్రాలను సమర్పించ లేకపోయారని.. మరో 1236 మంది పింఛన్లు తనిఖీ దశలో ఉన్నాయని వివ‌రించారు. జిల్లాలో 2019 నాటికి 2.23 లక్షల పింఛన్లు ఉండగా.. నేడు అవి 2.83 లక్షలకు చేరుకున్నాయని పేర్కొన్నారు. గత మూడేళ్లలో 60 వేల కొత్త పింఛన్లను జిల్లాలో మంజూరు చేసిన‌ట్లు తెలిపారు. గత మూడేళ్లుగా పింఛన్ల పంపిణీలో కొత్త ఒరవడి ప్రవేశ పెట్టిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్ కే దక్కుతుందని అన్నారు.

రాష్ట్రంలో అర్హులై వుండి పథకాలు అందకపోతే వారికి పథకాలు అందించేందుకు జనవరి, జూన్ నెలలో రెండు సార్లు పథకాలు మంజూరు చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అర్హులైన వారికి.. ఎలాంటి అవినీతి, మధ్య దళారులకు తావులేని విధంగా పథకాలు అందిస్తున్నామ‌ని తెలిపారు. గ్రామాల్లో అర్హులైన వారందరికీ అవినీతికి తావు లేకుండా పథకాలు అందించడం వల్లే ఈరోజు మా నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో తలెత్తుకొని తిరిగే పరిస్థితి వుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.


Next Story