ప్రజలకు మంత్రి అనిత కీలక సూచనలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి 'మొంథా' తుపాను ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

By -  Medi Samrat
Published on : 26 Oct 2025 4:23 PM IST

ప్రజలకు మంత్రి అనిత కీలక సూచనలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి 'మొంథా' తుపాను ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) ఎండీ ప్రఖర్ జైన్, రాబోయే 'మొంథా' తుపాను గమనం, తీవ్రత, దానివల్ల ప్రభావితమయ్యే జిల్లాల వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని, ప్రజలు కూడా అధికార యంత్రాంగానికి సహకరించి, సురక్షితంగా ఉండాలని మంత్రి అనిత విజ్ఞప్తి చేశారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో రాష్ట్రంలో తీవ్రమైన గాలులతో పాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని మంత్రి అనిత తెలిపారు. ఈ నేపథ్యంలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందుగానే గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. తీర ప్రాంత ప్రజలను నిరంతరం అప్రమత్తం చేయాలని, మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని మంత్రి అనిత స్పష్టం చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచాలని, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు.

Next Story