అచ్చెన్నాయుడుకి మంత్రి అనిల్‌ సవాల్

Minister Anil Kumar Fires On TDP. ఈరోజు వస్తున్న ఫలితాలు, రాబోతున్న ఫలితాలు కేవలం.. ఇంతకు ముందు పంచాయతీ

By Medi Samrat  Published on  19 Sep 2021 8:59 AM GMT
అచ్చెన్నాయుడుకి మంత్రి అనిల్‌ సవాల్

ఈరోజు వస్తున్న ఫలితాలు, రాబోతున్న ఫలితాలు కేవలం.. ఇంతకు ముందు పంచాయతీ ఎన్నికల్లో, ఆ తర్వాత మున్సిపల్‌ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలకు కొనసాగింపు మాత్రమే. అక్కడ ఎలాగైతే 80 శాతానికి పైగా వైసీపీకి వచ్చాయో, ఇప్పుడు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాలు కూడా అంతకు మించి ప్రజాభిమానాన్ని ప్రతిఫలిస్తున్నాయని మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అన్నారు. వ్యవస్థలను మేనేజ్‌ చేసి, పచ్చ మీడియా ద్వారా ప్రభుత్వంపై ఎన్ని కుట్రలు పన్నినా, ఎంతగా విషం చిమ్మినా.. రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పరిపాలనను విశ్వసించి ఇచ్చిన తీర్పుకు నిదర్శనమే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వస్తోన్న ఫలితాలు అని అనిల్‌ అన్నారు.

తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం మంత్రి అనిల్‌ కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు మించి పరిషత్ ఎన్నికల్లో ప్రజలు వైయస్ఆర్సీపీకి పట్టం కట్టబోతున్నారని చెప్పారు. ఒకవైపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, మరోవైపు అణగారిన ఆ వర్గాలకు రాజకీయ పదవులు ఇచ్చి, గుర్తింపు ఇవ్వడం ద్వారా, భారతదేశంలోనే కాకుండా, ఈ రాష్ట్ర చరిత్రలోనే కనివినీ ఎరుగని రీతిలో జ‌గ‌న్‌ పరిపాలన ఉందని ప్రజలు ప్రతి ఎన్నికల్లో రుజువు చేస్తున్నారన్నారు.

ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసే టీడీపీ ఎన్నికల బహిష్కరణ అంటూ డ్రామా ఆడిందని మంత్రి అనిల్ ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదని చెబుతున్న టీడీపీ నాయకులు.. పరాజయాన్ని కప్పిపుచ్చుకునేందుకు నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికలను బహిష్కరిస్తే.. ఎందుకు మీరు అభ్యర్థులను ప్రకటించారని.. ఎందుకు ప్రచారం చేశారని, బీ- ఫారాలు ఇచ్చి, ఎందుకు డబ్బులు పంచారని మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో ఫలితాలు చూశాక, డిపాజిట్లు కూడా రావని తెలిసి చేతులెత్తేసి, పారిపోయింది వాస్తవం కాదా? అని సూటిగా ప్రశ్నించారు. చాలాచోట్ల టీడీపీ తరఫున పోటీ చేసేందుకు కనీసం అభ్యర్థులు కూడా దొరకని మాట నిజం కాదా అని ప్రశ్నించారు.

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లోనూ టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. ఇక మిగిలింది, మీ పార్టీలో ఉన్న 19మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తే, ఎన్నికలకు వెళదాం. ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారో తేల్చుకుందా.. అని అచ్చెన్నాయుడుకి సవాల్ విసురుతున్నాను. దానికి సిద్ధమా..? మిమ్మల్ని, మీ పార్టీని సింగిల్‌ డిజిట్‌కు దించేస్తాం. ఇది నా సవాల్‌. ప్రజలు మీ వైపు ఉన్నారని చెబుతున్నారు కదా? దమ్ము, ధైర్యం ఉంటే, జగన్‌ మీద విశ్వాసం కోల్పోయారని మీరు విశ్వసిస్తే.. రాజీనామా చేసి ఎన్నికలకు రండని స‌వాల్ విసిరారు.


Next Story