పవన్ కళ్యాణ్ నటించినా.. సంపూర్ణేష్ బాబు నటించినా.. కష్టం అనేది ఇద్దరిదీ ఒకటేనని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఆన్‌లైన్ టికెట్ పోర్టల్ గురించి చిత్ర పరిశ్రమలోని కొందరు ప్రముఖులే ప్రభుత్వ పెద్దలతో చర్చించారని తెలిపారు. ఆన్‌లైన్ పోర్టల్ అంటే ఎందుకంత భయం .? దాని వల్ల జరిగే నష్టం ఏమిటి.? అకౌంటబులిటీ రావాలన్నదే ముఖ్యమంత్రి ఆలోచన అని అన్నారు. పారదర్శకత కోసమే ఆన్లైన్ పోర్టల్.. అందరికీ టికెట్ ధర ఒకేలా ఉండాలనేదే మా ఉద్దేశమని మంత్రి అనిల్ కుమార్ పేర్కొన్నారు. సినిమా ఖర్చులో కేవలం నలుగురైదుగురికి మాత్రమే లబ్ధి ఎక్కువగా ఉంటుందని.. ఇది ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు.
నా ఒక్కడి కోసం చిత్రసీమను వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని పవన్ కళ్యాణ్ మాట్లాడడం సరికాదని.. ఇది పవన్ కళ్యాణ్ క్రియేషన్ అని అన్నారు. చిత్రపరిశ్రమను ఇబ్బంది పెట్టే ఆలోచన మా ప్రభుత్వానికి లేదని.. పవన్ కళ్యాణ్ ఒక పక్క సీఎం జగన్ ను ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో మాట్లాడుతూ.. జగన్ చిత్ర పరిశ్రమనoతా ఇబ్బంది పెడుతున్నాడని ఒక ప్రొజక్షన్ ఇచ్చుకోవడం కరెక్ట్ కాదని అన్నారు. రాజకీయ ఉనికి కోసం సీఎం జగన్ ను తిట్టడం పవన్ కళ్యాణ్ కు ఫ్యాషన్ అయిపోయిందని మండిపడ్డారు. ప్రభుత్వ తీరును మారుస్తాను.. నేను రోడ్డు మీదకొస్తే మనిషిని కాదు.. బెండు తీస్తాం.. అని పవన్ కళ్యాణ్ మాట్లాడటం చాలా సార్లు చూశామని మంత్రి అనిల్ పేర్కొన్నారు.