ఆ సభతో టీడీపీ-జనసేన కూటమి పని గోవిందా..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు మరోసారి విరుచుకుపడ్డారు.
By Medi Samrat Published on 2 March 2024 4:33 PM ISTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు మరోసారి విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికి రాని వ్యక్తి అని.. కేవలం తెలుగు దేశం కోసమే జనసేన పార్టీని నడుపుతున్నారని విమర్శించారు. నిన్నటి దాకా జనసేనకు మద్దతు తెలిపిన కాపులంతా ఆ పార్టీని వదిలి వైసీపీలో చేరుతున్నారని అన్నారు. కాపు నేత హరిరామ జోగయ్య వాళ్ల కుమారుడు కూడా సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారని.. జనసేన మీద ఆశలు పెట్టుకున్న కాపులంతా పవన్ కళ్యాణ్ కారణంగా ఎంతో బాధ పడుతూ ఉన్నారని అన్నారు. చంద్రబాబు చెంతకు పవన్ కళ్యాణ్ చేరటంతో మోసపోయామని భావించారని అన్నారు. పవర్ షేరింగ్ లేకుండా పోవడంతో కాపులు నిరాశకు గురయ్యారని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. వైసీపీ నిర్వహిస్తున్న సిద్ధం సభలకు పోటీగా జనసేన-టీడీపీ ఎలాంటి సభలను కూడా నిర్వహించలేకపోతున్నాయని అన్నారు.
రాబోయేది జగన్ ప్రభుత్వమే అని ప్రజలే చెబుతున్నారని అన్నారు అంబటి. సీఎం జగన్‌ను ఎదుర్కొనే శక్తి టీడీపీ, జనసేనకు లేదని, తాడేపల్లిగూడెం సభలో వాళ్ల జెండా ఎత్తేశారన్నారు. మార్చి 10న నాలుగో సిద్ధం సభతో టీడీపీ-జనసేన కూటమి పని గోవిందేనన్నారు. పవన్ సినిమా డైలాగులు మాట్లాడుతున్నారు తప్ప మరేదీ కాదని అన్నారు పవన్ కళ్యాణ్. వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని ఆపడం జనసేన-టీడీపీ వల్ల అవ్వదని జోస్యం చెప్పారు అంబటి రాంబాబు.