చంద్రబాబుకు వచ్చింది బెయిల్ మాత్రమే : అంబటి

చంద్రబాబు నాయుడికి స్కిల్ డెవలప్ మెంట్ కేసులో బెయిల్ మాత్రమే వచ్చిందని.. ఆయన నిర్దోషిగా

By Medi Samrat  Published on  20 Nov 2023 6:18 PM IST
చంద్రబాబుకు వచ్చింది బెయిల్ మాత్రమే : అంబటి

చంద్రబాబు నాయుడికి స్కిల్ డెవలప్ మెంట్ కేసులో బెయిల్ మాత్రమే వచ్చిందని.. ఆయన నిర్దోషిగా విడుదల కాలేదని ఏపీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ‘వచ్చింది బెయిలే... నిర్దోషి అని తీర్పు కాదని.. రెచ్చిపోయి ప్రభుత్వాన్నీ , ముఖ్యమంత్రి ని దూషిస్తున్నారు.. మూల్యం చెల్లిస్తారు !’’ అని రాంబాబు విమర్శలు గుప్పించారు.

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సెప్టెంబర్ 9వ తేదీన చంద్రబాబునాయుడిని ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో చంద్రబాబుకు ఆరోగ్య కారణాలతో ఈ ఏడాది అక్టోబర్ 31న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది. రెగ్యులర్ బెయిల్ పై చంద్రబాబు తరపు న్యాయవాదులు, ఆంధ్రప్రదేశ్ సీఐడీ తరపు న్యాయవాదుల వాదనలను విన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సోమవారం నాడు తీర్పును ఇచ్చింది.

ఏపీ హైకోర్టు చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. చంద్రబాబుకు అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ ఇవ్వగా, ఆ బెయిల్ గడువు నాలుగు వారాలుగా న్యాయస్థానం పేర్కొంది. రెగ్యులర్ బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో, చంద్రబాబు ఈ నెల 28న రాజమండ్రి జైలుకు వెళ్లనక్కర్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. మధ్యంతర బెయిల్ సమయంలో విధించిన షరతులు ఈ నెల 28 వరకే వర్తిస్తాయని వివరించింది. చంద్రబాబు నవంబరు 29 నుంచి రాజకీయ సభలు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని హైకోర్టు ధర్మాసనం తెలిపింది. అయితే ఈ నెల 30న చంద్రబాబు విజయవాడలో ఏసీబీ కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది.

Next Story