ఏలూరు ఘటనపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని వివరణ
Minister Alla Nani About Eluru Incident. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ప్రజలు ఒక్కసారిగా మూర్చ లక్షణాలతో పడిపోవడంపై
By Medi Samrat
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ప్రజలు ఒక్కసారిగా మూర్చ లక్షణాలతో పడిపోవడంపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని స్పందించారు. 227 మంది అస్వస్థతకు గురయ్యారని, మూర్ఛ, వాంతులతో బాధపడుతున్న బాధితులు పెరుగుతున్నారని.. బాధితుల్లో 105 మంది పురుషులు, 76 మంది స్త్రీలు, 46 మంది చిన్నారులు ఉన్నారని ఆయన తెలిపారు. బాధితులకు ప్రభుత్వ ఆసుపత్రిలోనే కాకుండా ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ చేరి వైద్యం తీసుకుంటున్నారని చెప్పారు. 70 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. సమస్య ఉన్న ప్రాంతాల్లో మెరుగైన వైద్య క్యాంప్‌లు పెట్టామని, ఎవరికీ ప్రాణాపాయం లేదని తెలిపారు. కిడ్నీ, ఇతర వ్యాధులు ఉన్నవారి పరిస్థితి కాస్త విషమంగా ఉంటే వారిని విజయవాడకు తరలించామని తెలిపారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ప్రజలు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరా తీస్తున్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనానిలతో ప్రస్తుత పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఒకే సారి అంత మంది అస్వస్థకు గురికావడం గల కారణాలను అడిగి తెలుసకున్నారు. బాధితులకు మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
నీటి కాలుష్యం కారణంగానే ప్రజలు ఇలాంటి సమస్యలు అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆళ్ల నాని అంటున్నారు. నగరంలో నీటి సరఫరాలో ఎలాంటి కాలుష్యం లేదని.. బాధితులకు చేసిన రక్త పరీక్షల్లో ఎలాంటి ఎఫెక్ట్ లేదని.. కల్చర్ సెల్స్ సెన్సిటివిటి టెస్ట్ రిపోర్ట్ వస్తేనే ప్రజలకు వస్తోన్న వ్యాధి ఏమిటో తెలుస్తుందని ఆయన అన్నారు.