మిచౌంగ్‌ ఎఫెక్ట్‌: ఏపీలో అతి భారీ వర్షాలు.. రైతుల్లో కలవరం.. 308 పునరవాస కేంద్రాలు

తుపాను నేపథ్యంలో ఇవాళ, రేపు ఆంధ్రప్రదేశ్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.

By అంజి  Published on  5 Dec 2023 3:00 AM GMT
Michoung Effect,  Heavy rains, APnews, Farmers, resettlement centers

మిచౌంగ్‌ ఎఫెక్ట్‌: ఏపీలో అతి భారీ వర్షాలు.. రైతుల్లో కలవరం.. 308 పునరవాస కేంద్రాలు

మిచౌంగ్‌ తుపాను కారణంగా ఏపీ వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. తుపాను నేపథ్యంలో ఇవాళ, రేపు ఆంధ్రప్రదేశ్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇవాళ శ్రీకాకుళం, పార్వతీపురం, విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి సీతరామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, నంద్యాల, వైఎస్‌ఆర్‌ కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో, రేపు విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కోనసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

రాష్ట్ర వ్యాప్తంగా 308 పునరావస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ప్రభావిత ప్రాంతాల ప్రజలను కేంద్రాలకు తరలించారు. మరోవైపు రెస్క్యూ చర్యలు ఐదు ఎన్డీఆర్‌ఎఫ్‌, ఆరు ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. తుపాన్‌ నేపథ్యంలో వందల సంఖ్యలో రైళ్లు రద్దయ్యాయి.

మిచౌంగ్‌ తుపాను కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో స్కూళ్లకు ఇవాళ కూడా సెలవు ఉండనుంది. కృష్ణా, ఎన్టీఆర్‌, నెల్లూరు, తిరుపతి, శ్రీకాకుళం, ప్రకాశం, గుంటూరు, విశాఖపట్నం, వైఎస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాల్లో విద్యా సంస్థలకు కలెక్టర్లు సెలవులు ప్రకటించారు. తుపాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. తుపాను ప్రభావంతో తీరంలో సముద్రం పోటెత్తుతోంది.

తుపాను తీరం దాటే సమయానికి సముద్రజలాలు జనావాసాల్లోకి చొచ్చుకొచ్చే ప్రమాదం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీంతో కృష్ణపట్నం నుంచి మచిలీపట్నం వరకు పోర్టులకు 10 నెంబర్‌, కాకినాడకు 9, విశాఖ, కళింగపట్నం పోర్టులకు 3వ నెంబర్‌ హశ్రీచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్‌, రేణిగుంట, విశాఖ, చెన్నై ఎయిర్‌పోర్టుల్లో పలు విమాన సర్వీసులు రద్దు చేశారు.

మిచౌంగ్‌ తుపాను కారణంగా కురుస్తున్న వర్షాలతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఈదురుగాలులతో కోతకు సిద్ధంగా ఉన్న లక్షల ఎకరాల్లో వరి నేలవాలుతోంది. తుపానుపై ప్రభుత్వం ముందుగానే హెచ్చరికలు జారీ చేసినా.. అధికారులు క్షేత్రస్థాయిలో రైతులను అప్రమత్తం చేయలేదు. దీంతో ధాన్యం వర్షానికి తడిసి.. రంగు మారే ప్రమాదం ఉంది. అలు పలుచోట్ల పొగాకు, మిర్చి, మొక్కజొన్న, బొప్పాయి, అరటి, వేరుశనగ పంటలు సైతం దెబ్బతిన్నాయి.

మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్‌ తుపాను ప్రభావం తెలంగాణపైనా కూడా పడింది. నిన్నటి నుంచే రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో నిన్న రాత్రి నుంచి మొదలైన ముసురు.. ఇప్పటికీ పడుతూనే ఉంది. దీంతో చలికి తోడు వర్షం కురుస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే తుపాను ప్రభావం మరో రెండు రోజులు ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఈ జాగ్రత్తలు పాటించండి

- ఆస్తమా, సీవోపీడీ సమస్యలు ఉన్న వారు చలి వాతావరణానికి దూరంగా ఉండాలి

- వర్షంలో తడవకూడదు

- స్ట్రీట్‌, జంక్‌ ఫుడ్స్‌ తీసుకోవద్దు

- వేడిగా ఉన్న ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి

- కాచి చల్లార్చిన నీరు మాత్రమే తాగాలి

- జలుబు, దగ్గు సమస్యలు రాకుండా ఉండాలంటే మాస్క్‌ ధరించాలి

Next Story