ఆంధ్రప్రదేశ్‌కి వాతావరణ శాఖ భారీ హెచ్చరిక జారీ చేసింది. తుపాను ముప్పు పొంచి ఉందని తెలిపింది. 'మొంథా' తుపాను దూసుకొస్తొందని, రాష్ట్రంలోనే తీరం దాటే ఛాన్స్ ఉందని తెలిపింది. ఈ మేరకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రేపటి నుంచి వరుసగా 4 రోజుల పాటు తుపాను ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంటుందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. 28వ తేదీన సాయంత్రం కాకినాడ సమీపంలో తుపాను.. తీవ్రమైన తుపానుగా మారి తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. ఆ సమయంలో గంటలకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. వైజాగ్ నుంచి తిరుపతి వరకు దీని ఎఫెక్ట్ ఉండనుంది.
తెలంగాణలో సైతం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీ రాష్ట్రంలోని తీర ప్రాంతంలోని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలని విద్యాశాఖకు వాతావరణ శాఖ అధికారులు సూచించారు. మచిలీపట్నం, గుంటూరు, ఏలూరు, దివిసీమ, విజయవాడ, గోదావరి జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. గంటకు 7 కి.మీ వేగంతో వాయుగుండం కదులుతోంది. ప్రస్తుతానికి పోర్ట్ బ్లెయిర్ కి 440 కి.మీ,విశాఖపట్నంకి 970 కి.మీ చెన్నైకి 970 కి.మీ, కాకినాడకి 990 కి.మీ, గోపాల్‌పూర్ కి 1040 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది.