విజయసాయి రెడ్డిపై ఫిర్యాదు

కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై రాజ్యసభ చైర్మన్ కు ఫిర్యాదు చేశారు

By Medi Samrat  Published on  6 Feb 2024 9:15 PM IST
విజయసాయి రెడ్డిపై ఫిర్యాదు

కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై రాజ్యసభ చైర్మన్ కు ఫిర్యాదు చేశారు. రాజ్యసభలో విజయసాయి తనపై ఆరోపణలు చేశారని.. ఓ లోక్ సభ సభ్యుడి గురించి రాజ్యసభలో మాట్లాడడం సరికాదని అన్నారు. ఇది సభా హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందని స్పష్టం చేశారు. విజయసాయిరెడ్డి ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రధాని మోదీని ఎంతమాత్రం ప్రశ్నించడంలేదని మాణికం ఠాగూర్ విమర్శించారు. 2019 నుంచి కేంద్రం తీసుకువచ్చిన అన్ని బిల్లులకు జగన్ మద్దతు ఉందని వెల్లడించారు. అన్ని ప్రజా వ్యతిరేక బిల్లులకు జగన్ మద్దతు ఇచ్చారని.. పార్లమెంటులో కేంద్రానికి మద్దతు ఇచ్చే వైసీపీ, బయట మాత్రం వ్యతిరేకిస్తుంటుందని తెలిపారు. బీజేపీకి జగన్ ఏటీఎంలా మారారని, మోదీ, అమిత్ షాలకు జగన్ లొంగిపోయారని మాణికం ఠాగూర్ విమర్శించారు. కేసుల కోసమే జగన్, విజయసాయి బీజేపీకి లొంగిపోయారని అన్నారు.

తాను ప్రత్యేక హోదా గురించి వైసీపీని ప్రశ్నిస్తే విజయసాయి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారని మాణికం ఠాగూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు తెలంగాణ ఇస్తామని అప్పటి కాంగ్రెస్ మేనిఫెస్టో‌లో పెట్టినట్లు గుర్తు చేశారు. ఆ హామీ మేరకు కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని.. తెలుగు రాష్ట్రాల విభజన సందర్భంగా ప్రత్యేక హోదా హామీని ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చారని తెలిపారు. కానీ ఆ తర్వాత వచ్చిన మోదీ ప్రభుత్వం ఆ హామీని నెరవేర్చక పోయినప్పటికీ.. కాంగ్రెస్ తప్పు చేసిందంటూ విజయసాయిరెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాణికం ఠాగూర్.

Next Story