రాజధానిలో పేదవాడికి గూడు ఉండకూడదని, సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని చంద్రబాబు నాయుడు కుట్రలకు పాల్పడ్డారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి జగన్ ఆకాంక్ష మేరకు పేద ప్రజల కల సహకారం చేసే దిశగా న్యాయస్థానాలు కూడా అండగా నిలబడ్డాయన్నారు. రాజధాని ప్రాంతంలో పేద ప్రజలకు సొంత ఇంటి కల నెరవేరబోతున్న సమయంలో నారా చంద్రబాబు నాయుడు కుట్రలు కుతంత్రాలకు పాల్పడుతున్నాడని, కేసులు వేసి పచ్చ మీడియాతో అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజధాని ప్రాంతంలో సుమారు 23,000 మందికి ఇళ్ల స్థలాలు, సుమారు 2,000 మందికి టిడ్కో గృహాలు అందజేస్తున్నామన్నారు. జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 20 రోజుల్లో ఇళ్ల పట్టాలు పంపిణీ పూర్తి చేస్తామన్నారు. శనివారం మధ్యాహ్నం రాజధాని ప్రాంతంలో కృష్ణాయపాలెం లేఔట్ వద్ద పెనుమాక 1, 2 సచివాలయాల పరిధిలో 261 మంది లబ్దిదారులకు, కృష్ణాయపాలెంలో ఉన్న 26 మంది లబ్ధిదారులకు జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలో ఎమ్మెల్యే ఆర్కే ఇళ్ళ పట్టాలను అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.