Andhrapradesh: తల్లీ కూతుళ్ల హత్య, మైనర్‌పై అత్యాచారం.. నిందితుడికి మరణశిక్ష

మహిళను, ఆమె తల్లిని హత్య చేసి, బాధితురాలి కుమార్తెలపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి చిత్తూరు కోర్టు మరణశిక్షను విధించింది.

By అంజి  Published on  23 Aug 2023 2:00 AM GMT
crime, Andhra Pradesh, Tirupati,  Tamballapalle

Andhrapradesh: తల్లీ కూతుళ్ల హత్య, మైనర్‌పై అత్యాచారం.. నిందితుడికి మరణశిక్ష

వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను, ఆమె తల్లిని హత్య చేసి, బాధితురాలి మైనర్ కుమార్తెలపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి చిత్తూరు కోర్టు మంగళవారం జీవిత ఖైదుతో పాటు మరణశిక్షను విధించింది. మదనపల్లి పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్‌ ప్రకారం.. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె మండలం గోవిందవారి పల్లెకు చెందిన సరళతో మౌలాలి లైవ్‌ ఇన్‌ అరేంజ్‌మెంట్‌ చేసుకున్నాడు. సరళ వితంతువు, ఆమె 65 ఏళ్ల తల్లి, ముగ్గురు చిన్న కుమార్తెలతో నివసించింది. మౌలాలి వారిని ఏటిగడ్డ తండా సమీపంలోని తన ఫాంహౌస్‌కు తరలించి ఆమెతో సంబంధాన్ని కొనసాగించాడు. ఈ క్రమంలోనే సరళ మరో వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకుందని మౌలాలికి అనుమానం వచ్చింది.

"సెప్టెంబర్ 29, 2020 న, మౌలాలి సరళను హత్య చేసి, ఆమె మృతదేహాన్ని పెద్దేరు ప్రాజెక్ట్ దగ్గర పడేశాడు" అని ఛార్జిషీట్ పేర్కొంది. ఒక నెల తరువాత సరళ తల్లి మౌలాలి తన కుమార్తె తప్పిపోయిన విషయం గురించి ప్రశ్నించడం ప్రారంభించినప్పుడు, అతను వృద్ధురాలిని గొంతుకోసి చంపి, ఆమె మృతదేహాన్ని స్థానిక నీటి ట్యాంక్‌లో పడేశాడు. తరువాత మౌలాలి సరళ ముగ్గురు చిన్న కుమార్తెలను కర్ణాటకలోని మారుమూల ప్రాంతానికి మార్చాడు. అక్కడ అతను వారిని లైంగిక వేధింపులకు గురిచేశాడు. గోవిందవారి పల్లెలో ఒక వృద్ధురాలు ఇచ్చిన 'తప్పిపోయిన వ్యక్తి' ఫిర్యాదుతో తంబళ్లపల్లె పోలీసులు దర్యాప్తు ప్రారంభించి.. 2021 ఫిబ్రవరిలో మౌలాలిని అరెస్టు చేశారు.

అప్పటి డీఎస్పీ ఆర్‌ఎం చారి నేతృత్వంలోని పోలీసులు పెద్దేరు ప్రాజెక్ట్ నుంచి సరళ, ఆమె తల్లి మృతదేహాలను వెలికితీసి ఆమె మైనర్‌ కుమార్తెలను స్థానిక షెల్టర్‌ హోంలో ఉంచారు. మౌలాలిపై అభియోగాలు రుజువైన తర్వాత, చిత్తూరులోని అదనపు జిల్లా జడ్జి కోర్టు అతనికి హత్య కేసులో ఐపిసి సెక్షన్ 302 కింద మరణశిక్ష విధించింది. SC/ST అట్రాసిటీ చట్టం, ఇతర నేరాలకు సంబంధించి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష, జీవిత ఖైదును విధించింది కోర్టు.

Next Story