నేనే శివుడిని అంటున్న మదనపల్లె జంట హత్యల నిందితురాలు

Madanapalle Murder Accused. మదనపల్లె లో మూఢభక్తితో దారుణంగా ఇద్దరు కూతుళ్లను హత్యచేసిన తల్లి నేనే శివుడిని అంటుంది.

By Medi Samrat  Published on  26 Jan 2021 10:49 AM GMT
Madanapalle Murder Accused.

మూఢభక్తితో దారుణంగా ఇద్దరు కూతుళ్లను హత్య చేసిన ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె రూరల్ మండలం అంకిశెట్టిపల్లె పంచాయతీలోని శివనగర్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల ప్రజలను షాక్ కు గురిచేసింది. శివనగర్‌కు చెందిన పురుషోత్తం నాయుడు మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో వైస్ ప్రిన్సిపల్. ఆయన భార్య పద్మజ ఓ విద్యాసంస్థలో కరస్పాండెంట్‌గా, ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు. ఈ జంట హత్యలకు పాల్పడిన తల్లి పద్మజ మాటలు వింటుంటే అందరికీ షాకింగ్ గా అనిపిస్తూ ఉన్నాయి.


నిందితురాలు పద్మజను అదుపులోకి తీసుకున్న పోలీసులు కరోనా పరీక్షల నిమిత్తం మదనపల్లె ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడ ఆమె వింతగా ప్రవర్తించారు. శివుడు మదనపల్లెలోనే ఉన్నాడని, అందుకే కరోనా పారిపోయిందని వ్యాఖ్యలు చేసింది. నేనే శివుడ్ని... నాకు కరోనా రావడమేంటి? అని చెప్పుకొచ్చింది. కరోనాను సృష్టించింది చైనా కాదు తానే అంటూ గుట్టుగా మాట్లాడింది. దయ్యం పట్టినందునే తమ కుమార్తెలను డంబెల్స్ తో కొట్టిచంపామని, మళ్లీ వాళ్లిద్దరూ బతికి వస్తారని వెల్లడించారు. తమ ఇంట్లో కొన్నిరోజులుగా ఎన్నో మహిమలు జరిగాయని, తమ ఇంట్లో దేవుళ్లు ఉన్నారని పోలీసులకు చెప్పారట. తాము పూజలతోనే చిన్నకుమార్తె సాయిదివ్య అనారోగ్యాన్ని తగ్గించామని, వారం పాటు అర్ధరాత్రి 12 గంటలకు ఇంటి బయట పూజలు చేశామని చెప్పారు. ఇక కలియుగం అంతమైందని, సత్యయుగం మొదలైందని పోలీసులకు వివరించారు. తమ ఇద్దరు కుమార్తెలను ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నామని, వారిద్దరూ చదువుల్లో మేటి అని తల్లి పద్మజ తెలిపింది. తాము పూర్తి స్పృహలోనే ఉన్నామని, తమ పిల్లలు ప్రాణాలతో మళ్లీ తిరిగి వస్తారని చెప్పుకొచ్చింది పద్మజ.

ఉన్నత విద్యావంతులై కళాశాల ప్రిన్సిపాళ్లగా పనిచేస్తున్న భార్యాభర్తలు, ఉన్నత విద్యావంతులైన వారి కుమార్తెలు క్షుద్రపూజలను నమ్మడం అందరికీ షాకింగ్ గా అనిపిస్తోంది. ఈ కుటుంబానికి భక్తి కూడా అపారం. అన్ని విషయాలకు బాబా దయే కారణమని చెప్పుకునేవారు. పద్మజ ఫేస్‌బుక్ పోస్టులు మొత్తం ఆధ్యాత్మికానికి చెందినవే. ఆమె భర్త పురుషోత్తంనాయుడు తరచూ ఆధ్యాత్మిక, తాంత్రిక పుస్తకాలు చదువుతూ ఉండేవారు.

ఇక వారం రోజుల క్రితం పెద్దమ్మాయి అలేఖ్య (27), సాయిదివ్య కలిసి పెంపుడు కుక్కను వాకింగ్‌కు తీసుకెళ్లారు. మూడు రోడ్ల కూడలిలో ముగ్గువేసి అందులో ఉంచిన నిమ్మకాయలను పొరపాటున తొక్కేశారు. ఇంటికొచ్చాక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో ఏమైనా అవుతుందోమోనని భయపడిపోయారు. గత వారం రోజులుగా పద్మజ, పురుషోత్తం ఇద్దరూ ఇంట్లోనే ఉంటున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో పూజలు చేస్తుండగా, పై అంతస్తులో ఉన్న సాయిదివ్య మ్యూజిక్ వాయిస్తూ ఒక్కసారిగా కేకలు వేసింది. మానసిక రోగిలా ప్రవర్తించింది. దీంతో పరుగున వెళ్లిన మిగతా ముగ్గురు ఆమెకు దెయ్యం ఆవహించిందని భావించారు. దానిని వదిలించేందుకు ఆమె తలపై డంబెల్‌తో గట్టిగా కొట్టారు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అలేఖ్య చెల్లెలి నుదుటిపై ముగ్గులు వేసి ఆత్మ బయటకు వెళ్లకుండా బందించానని చెప్పింది. ఆమెను బతికించేందుకు తనను కూడా చంపాలని తల్లిని కోరింది. దీంతో ముగ్గురూ కలిసి నగ్నంగా పూజలు చేశారు. పూజల అనంతరం అలేఖ్యను పూజగదిలోకి తీసుకెళ్లిన తల్లి నోట్ల రాగి కలశాన్ని పెట్టి, అందులో నవధాన్యాలు పోసింది. ఆపై డంబెల్‌తో ఆమెను కూడా కొట్టి చంపారు. సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఏడు గంటలకు విషయాన్ని పురుషోత్తం తన సహచర అధ్యాపకుడికి ఫోన్ చేసి చెప్పాడు. ఆయన పరుగున వచ్చి అక్కడి దృశ్యాన్ని చూసి విస్తుపోయాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.


Next Story
Share it