20 నెలల్లో ప్రజలకు చేసింది శూన్యం : లోకేష్
Lokesh Comments On YS Jagan Govt. ఈ మద్య ఏపీలో రాజకీయాలు భలే రసవత్తంగా మారుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన
By Medi Samrat
ఈ మద్య ఏపీలో రాజకీయాలు భలే రసవత్తంగా మారుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన పంచాయితీరాజ్ ఎన్నికల్లో వైసీపీ జెండా పాతారు. అయితే టీడీపీ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేసింది. జనసేన కష్టాలు ఈదుతూనే ఉంది. తాజాగా టిడిపి పురపాలక ఎన్నికల మేనిఫెస్టోను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్‌లో విడుదల చేశారు. 'పల్లెలు గెలిచాయి.. ఇప్పుడిక మనవంతు' పేరుతో 10 అంశాలతో ఎన్నికల ప్రణాళికను విడుదల చేశారు. పురపాలక ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగురవేయాలని యోచిస్తుంది.
ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం గత 20 నెలల్లో ప్రజలకు చేసింది శూన్యమని దుయ్యబట్టారు. శాంతి భద్రతలు అదుపు తప్పటంతో బులెట్ లేని గన్‌గా జగన్ మిగిలారని ఎద్దేవా చేశారు. గతంలో 200 రూపాయలు వచ్చే విద్యుత్ బిల్లులు ఇప్పుడు వెయ్యి రూపాయలకు పైగా వస్తున్నాయని.. విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచేశారని అన్నారు. ప్రశాంతంగా ఉన్న విశాఖలో భూకబ్జాలు, బెదిరింపులు పెరిగాయని లోకేశ్ మండిపడ్డారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాక బస్సు ఛార్జీలు పెంచారని మండిపడ్డారు. నిరుద్యోగ యువతకు ప్రతి 6నెలలకోసారి ఉద్యోగమేళా నిర్వహిస్తామని చెప్పారు. సుందరీకరణ మిషన్, చెత్త లేని నగరం ఏర్పాటు చేస్తామని తెలిపారు. మెప్మాలు బలోపేతంతో పాటు పట్టణ పేదలకు టిడ్కో ఇళ్లు పంపిణీ చేపడతామని వివరించారు. పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు 21 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు.