చిత్తూరు జిల్లాలో లోక్‌సభ స్పీకర్ పర్యటన
Lok Sabha Speaker Om Birla Chittoor Visit. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఓం బిర్లా రెండు
By Medi Samrat
లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఓం బిర్లా రెండు రోజుల పాటు ఏపీలోని చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. సోమవారం మధ్యాహ్నం ఆయన రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకొని, సాయంత్రం 4 గంటలకు తిరుమల వెళ్లనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు వైకుంఠద్వార దర్శనం చేసుకుంటారు. తిరుమలలో ఓం బిర్లా శ్రీకృష్ణ గెస్ట్ హౌస్‌లో బస చేయనున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. ఆ తర్వాత పద్మావతి గెస్ట్‌హౌస్‌లో టీటీడీ అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. ఆయన తన పర్యటనలో భాగంగా తిరుమల ధర్మగిరి వేదపాఠశాలను సందర్శిస్తారు. ఆ తర్వాత కపిలేశ్వరస్వామి వారిని దర్శించుకుంటారు. అనంతరం శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకుంటారు.
ఇటీవల లోక్ సభ సమావేశాలు రసాభాసగా మారిన సంగతి తెలిసిందే..! పలు అంశాలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు గొడవలకు దిగడం, సభా కలాపాలకు అడ్డుతగులుతూ రావడంతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముందస్తుగానే ముగిశాయి. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 13 వరకు సభ జరగాల్సి ఉండగా ప్రతిపక్షాల ఆందోళనల కారణంగా రెండురోజుల ముందే ముగించారు. ఈ సమావేశాల్లో లోక్‌సభ కేవలం 22శాతం ప్రొడక్టివిటీతో మొత్తంగా 21 గంటల 14 నిమిషాలు మాత్రమే పనిచేసింది. విపక్షాల నిరసనల కారణంగా 74 గంటలు వృథా అయ్యాయి. పెగాసస్ పై చర్చకు పట్టుబట్టిన విపక్షాలు మొదటి రోజు నుంచే ఆందోళనలకు దిగారు.
దీంతో సభలో వాయిదా పర్వం నడిచింది. ఈ సమావేశాల్లో లోక్‌సభ మొత్తంగా 17 సార్లు సమావేశమైంది. ఇందులో మొత్తం 96 పనిగంటలు ఉండగా.. లోక్‌సభ కేవలం 21 గంటల 14 నిమిషాలు మాత్రమే పనిచేసింది. లోక్‌సభ వర్షాకాల సమావేశాల్లో కార్యకలాపాలు జరిగిన తీరుపై సభాపతి ఓం బిర్లా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సెషన్‌లో ఆశించిన స్థాయిలో కార్యకలాపాలు జరగకపోవడం తనను తీవ్రంగా కలచివేసిందని చెప్పారు. సభలో గరిష్ఠ స్థాయిలో కార్యకలాపాలు జరిగేవిధంగా, ప్రజలకు సంబంధించిన సమస్యలపై చర్చలు జరిగే విధంగా తాను ఎల్లప్పుడూ కృషి చేశానని చెప్పారు. ఈ సెషన్‌లో సభా కార్యకలాపాలకు నిరంతరం అడ్డంకులు ఎదురయ్యాయన్నారు.