సముద్రంలో ఊహించని మార్పులు.. అంతర్వేదిలో మారిపోయిన పరిస్థితులు..!

Local People Worried About Sea Waves At Antarvedi. తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలో ఉన్న అంతర్వేదిలో లక్ష్మీ నరసింహ

By Medi Samrat  Published on  25 Aug 2021 5:41 PM IST
సముద్రంలో ఊహించని మార్పులు.. అంతర్వేదిలో మారిపోయిన పరిస్థితులు..!

తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలో ఉన్న అంతర్వేదిలో లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఉంది. గత కొద్ది రోజులుగా అంతర్వేది వద్ద సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది.. ఇప్పుడేమో ఉన్నట్టుండి రెండు కిలోమీటర్ల మేర వెనక్కి వెళ్లిపోయింది. తూర్పు తీరంలో సముద్రం కొన్ని చోట్ల ముందుకు, మరికొన్నిచోట్ల వెనక్కు వెళ్ళిపోయింది. కిలోమీటర్ల మేర భిన్నమైన మార్పులు కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. గతంలో అమావాస్య, పౌర్ణానికి ముందుకు వచ్చే సముద్రం .. గత నెల రోజులుగా 45 మీటర్ల మేర ముందుకు చొచ్చుకొచ్చింది. సముద్రం ముందుకు రావడంతో.. తీరమంతా మునిగిపోయి.. నీరే కనిపిస్తోంది. ఫలితంగా సముద్రం ఒడ్డున నిర్మించిన షాపులు కూలిపోయాయి. వారం రోజుల క్రితం సముద్రం 25 మీటర్ల మేర ముందుకొచ్చింది.

ఇప్పటి వరకు సముద్రం 45 మీటర్ల మేరకు ముందుకు వచ్చింది. అలల తాకిడి కారణంగా సముద్రం ఒడ్డున ఉన్న భవనం ధ్వంసమైంది. అలల ఉధృతికి కింద నేల కొట్టుకుపోవడంతో భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రమాద సమయంలో భవనంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. 20 ఏళ్లకోసారి సముద్రం ఇలా ముందుకు వెళ్తుందని స్థానికులు చెబుతున్నారు. అంతర్వేది వద్ద సముద్రం ముందుకు వస్తుండగా ఇక్కడికి 128 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉప్పాడ తీరం వద్ద సముద్ర జలాలు వెనక్కి వెళ్లాయి. అంతర్వేదిలో అన్నాచెల్లెలి గట్టు వద్ద సముద్రం వెనక్కి వెళ్లిపోయింది.అనుహ్యంగా రెండు రోజుల వ్యవధలో చోటుచేసుకుంటున్న మార్పులతో సముద్ర తీర ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.


Next Story