ప్రముఖ సాహితీవేత, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ ఆశావాది ప్రకాశరావు మృతి చెందారు. 77 ఏళ్ల వయస్సులో ఆయన కన్నుమూశారు. అనంతపురం జిల్లా పెనుకొండకు చెందిన ప్రకాశరావు అష్టావధాని. ఆయనకు నిన్న మధ్యాహ్నం గుండె పోటు వచ్చింది. దీంతో ప్రకాశరావు తుదిశ్వాస విడిచారు. తన సాహితీ జీవితంలో ఇప్పటి వరకు 170కిపైగా అవధానాలు చేసిన ప్రకాశరావు.. 50కి పైగా పుస్తకాలను రచించారు. 2021లో ప్రకాశరావు సాహితీ సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. పద్మశ్రీ పురస్కారంతో అతన్ని సత్కరించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా కళారత్న బిరుదుతో సత్కారం చేసింది. శింగనమల మండలం కొరివిపల్లి గ్రామంలో 1944 ఆగస్టు 2న జన్మించారు.
ప్రకాశరావు మృతితో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రకాశరావు మృతి పట్ల పలువురు సాహితీ ప్రముఖులు, కళాకారులు, రాజకీయ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రకాశరావు తన కళ్లను ఇప్పటికే దాన చేశారు. దీంతో సాయిట్రస్టు నేతృత్వంలోని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి డాక్టర్లు.. ఆయన కళ్లను సేకరించి హైదరాబాద్‌కు తరలించారు. మెరుపుతీగలు, పుష్పాంజలి, విద్యా విభూషణ, అంతరంగ తరంగాలు, చెల్లపిళ్లరాయ చరిత్రము, శ్రీ రాప్తాటి పరిచయ పారిజాతము, ఆర్కెస్ట్రా (వచన కవిత), ఘోషయాత్ర నాటకం, నారాయణ శతకము, సహయాచారి సాహితీ సాహచర్యము వంటి రచనలు చేశారు. ప్రకాశరావు 40కిపైగా పురస్కారాలు, అవార్డులు అందుకున్నారు.