ఏపీ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఇచ్చిన వెరైటీ జీవో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పెంచుకునే కుక్కలు, పందులకు లైసెన్స్ లు ఉండాలంటూ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. లైసెన్స్ లేని కుక్కలు, పందులను అధికారులు పట్టుకుంటే.. రూ.500 ఫైన్ తోపాటు రోజుకు రూ.250లు పెనాల్టీని వసూలు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
అధికారులు పట్టుకున్నప్పుడు అవి తమవేనంటూ ఎవరూ ముందుకు రాకపోతే వాటిని వీధి కుక్కులు, పందులుగా పరిగణించి కుటుంబ నియంత్రణ చేయాలని ఉత్తర్వుల్లో వెల్లడించారు. లైసెన్స్ గడువు ముగిసిన తర్వాత 10 రోజుల్లోగా తిరిగి లైసెన్స్ పొందాలని ఆదేశాల్లో వెల్లడించారు. ఇక లైసెన్స్ లు పొందే ముందు ఆ కుక్కలు, పందుల యజమానులు వాటి హెల్త్ సర్టిఫికెట్ అందజేయాలంటూ తెలిపారు. ప్రభుత్వ వెటర్నరీ డాక్టర్ సర్టిఫికెట్ ను అందించాలని ఆదేశించింది. ఈ జంతువులకు టోకెన్లను జారీ చేయాలని తెలిపింది. ఈ టోకెన్లు వాటి మెడ చుట్టూ నిరంతరం వేలాడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.